అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి
యువతలో చైతన్యం పెరిగితేనే సమాజ మార్పు
విద్య, సంఘటిత శక్తి ద్వారానే సమానత్వం సాధ్యం
న్యాయ సమాజ నిర్మాణమే అంబేద్కర్‌కు నిజమైన నివాళి
బీజేపీ నాయకుడు పేరం గోపికృష్ణ
కాకతీయ, హన్మకొండ : అంబేద్కర్ ఆశయ సాధనలో యువత కీలక పాత్ర పోషించాలని బీజేపీ నాయకుడు పేరం గోపికృష్ణ పిలుపునిచ్చారు. మంగళవారం బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా బీజేపీ నాయకుడు పేరం గోపికృష్ణ తన అనుచరులతో కలిసి హన్మకొండలోని విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ దేశానికి చూపిన మార్గం సమానత్వం, న్యాయం, స్వేచ్ఛల ఆధారంగా ఉన్నదని పేర్కొన్నారు. అంబేద్కర్ ఆశయాల సాధనకు పాటుపడాల్సిన బాధ్యత ప్రతీ భారతీయుడిపై ఉందని అన్నారు. విద్యతోనే వ్యక్తిగత ఎదుగుదల సాధ్యమవుతుందని, అదే సమాజ మార్పునకు బలమైన ఆయుధమని గోపికృష్ణ తెలిపారు. యువత చదువుతో పాటు సామాజిక బాధ్యతను గుర్తించి, అన్యాయాలపై స్పందించాలన్నారు. సంఘటిత శక్తి ద్వారా మాత్రమే హక్కులను సాధించవచ్చని స్పష్టం చేశారు. సమానత్వ దిశగా కలిసి నడవాలని సూచించారు. యువతలో సామాజిక బాధ్యత, అవగాహన పెరిగితే దేశం మరింత బలపడుతుందని చెప్పారు. అంబేద్కర్ ఆశయాలను ఆచరిస్తూ సమానత్వ సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.


