ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు
గీసుగొండ తహసీల్దార్ ఎం.డి. రియాజుద్దీన్
కాకతీయ,గీసుగొండ : ప్రభుత్వ భూములను ఆక్రమించాలని చూస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని గీసుకొండ తహసీల్దార్ ఎం.డి. రియాజుద్దీన్ హెచ్చరించారు. ఆదివారం గొర్రెకుంట రెవెన్యూ పరిధిలో అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను రెవెన్యూ, పోలీస్ సిబ్బందితో కలిసి తొలగించినట్లు ఆయన తెలిపారు.ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. గొర్రెకుంట రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 95లో గల 28 ఎకరాల మల్లికుంట శిఖం భూమిని గతంలో ఐయన్ గా కన్వర్ట్ చేసి,58, 59 జీవోల కింద అర్హులకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.అయితే,అదే సర్వే నంబర్‌లో ఇంకా 19 గుంటల మిగులు భూమి ఉందని, ఆ భూమిలో కొంతమంది వ్యక్తులు అక్రమంగా ఇండ్ల నిర్మాణాలు చేపట్టగా వారికి ఇప్పటికే నోటీసులు జారీ చేశామని వెల్లడించారు. ఆదివారం రాత్రి సమయంలో కొంతమంది గుట్టుచప్పుడు కాకుండా నిర్మాణ పనులు చేపడుతున్నారన్న సమాచారం మేరకు వెంటనే స్పందించి,రెవెన్యూ,పోలీస్ బలగాలతో ఆ నిర్మాణాలను కూల్చివేసినట్లు ఆయన పేర్కొన్నారు.దళారుల మాటలు నమ్మి ప్రభుత్వ భూముల్లో ఇండ్లు కట్టుకోవడం,కొనుగోలు, అమ్మకాలు వంటి లావాదేవీలు జరపవద్దని సూచించారు. అక్రమాలకు పాల్పడితే రెవెన్యూ చట్టం ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. మండల పరిధిలో ఎక్కడైనా ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే వెంటనే రెవెన్యూ అధికారులకు సమాచారం అందించాలని మండల ప్రజలను తహసీల్దార్ ఎం.డి. రియాజుద్దీన్ కోరారు.


