ఈ ఎన్ టి ఆసుపత్రిలో వివాదం
వైద్యం వికటించడంతో బాధిత మహిళ రోగికి తీవ్ర రక్తస్రావం
వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యుల ఆరోపణ
ఆసుపత్రి ఎదుట బంధువుల ఆందోళన
ఇన్సూరెన్స్ క్లెయిమ్ తర్వాత అదనపు వసూళ్ల ఆరోపణలు
సుబేదారి పోలీసుల జోక్యం.. ఉద్రిక్త పరిస్థితి
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
కాకతీయ, వరంగల్ బ్యూరో : హన్మకొండ జిల్లాలోని గౌడ రమేష్ ప్రైవేట్ ఈ ఎన్ టి ఆసుపత్రిలో జరిగిన వైద్య ఘటన ఉద్రిక్తతకు దారి తీసింది. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి గ్రామానికి చెందిన పద్మ అనే మహిళకు ముక్కు ఆపరేషన్ నిర్వహించిన తర్వాత పరిస్థితి విషమించిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. స్థానికుల వివరాల ప్రకారం.. డా. గౌడ రమేష్ దంపతులు నిర్వహించిన శస్త్రచికిత్స అనంతరం బాధిత మహిళకు తీవ్ర రక్తస్రావం కావడంతో పరిస్థితి అదుపుతప్పిందని తెలిపారు. వెంటనే మెరుగైన చికిత్స అందించడంలో నిర్లక్ష్యం వహించారని ఆరోపిస్తూ, బాధితురాలి భర్త, బంధువులు హన్మకొండలోని ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఇక, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా క్లెయిమ్ చేసుకున్న తర్వాత కూడా ఆసుపత్రి యాజమాన్యం అదనపు డబ్బులు వసూలు చేసిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ భార్య ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రావడానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని వారు ఆరోపిస్తూ, బాధ్యులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సమాచారం అందుకున్న సుబేదారి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఆందోళన చేస్తున్న కుటుంబ సభ్యులను శాంతింపజేయడానికి ప్రయత్నించారు. అయితే, తమకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని బాధిత కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి విచారణ చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సంబంధిత అధికారుల దర్యాప్తు అనంతరం అసలు కారణాలు వెలుగులోకి రానున్నాయి.



