భూ భారతితో సమస్యలకు శాశ్వత పరిష్కారం
భూ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి
ఒకే గొడుగు కిందకు రెవెన్యూ, ల్యాండ్ సర్వే, రిజిస్ట్రేషన్ విభాగాలు
ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
కూసుమంచి మండలంలో భూ భారతి పైలట్ పోర్టల్ ప్రాజెక్ట్
అమలు తీరుపై అధికారులతో కలెక్టర్ సమీక్ష
కాకతీయ,ఖమ్మం : ప్రజలకు పారదర్శకంగా సులభతరమైన సేవలు అందించడానికి, భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.గురువారం కూసుమంచి మండల కేంద్రంలోని తహసీల్దారు కార్యాలయంలో ఇంటిగ్రేటెడ్ భూ భారతి పైలట్ పోర్టల్ ప్రాజెక్ట్ అమలు పై రెవెన్యూ, సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ భూ సమస్యలకు పరిష్కారం కోసం రెవెన్యూ, ల్యాండ్ సర్వే, రిజిస్ట్రేషన్ విభాగాలను ఒకే గొడుగు కిందకు తెస్తున్నట్లు తెలిపారు. ఇంటిగ్రేటెడ్ భూ భారతి పోర్టల్ ను ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్ క్రింద ఖమ్మం జిల్లాలోని కూసుమంచి మండలంలో ప్రవేశపెట్టిందని అన్నారు. తహసిల్దార్ కార్యాలయం వద్ద భూములు రిజిస్ట్రేషన్ చేసే సమయంలో సర్వే మ్యాప్ లు అందించే దిశగా ఇంటిగ్రేటెడ్ భూ భారతి పోర్టల్ రూపొందించామని అన్నారు. రైతులు ఇంటి వద్ద నుంచి కూడా స్లాట్ బుకింగ్ చేసుకునేలా పోర్టల్ తయారు చేశామని తెలిపారు. రైతులు లాగిన్ కాగానే భూమి వివరాలు కనిపిస్తాయని అన్నారు.
దరఖాస్తు తర్వాత ఏడు రోజుల్లో సర్వే పూర్తి
ఎన్ని ఎకరాలకు సర్వే కావాలో కోరితే అందుకు సంబంధించిన ఫీజు చెల్లించిన తర్వాత గ్రామంలోని లైసెన్స్ సర్వేయర్ లాగిన్ కు వెళ్తాయని, రెండు రోజుల్లో ఆ రైతు భూమికి సరిహద్దు ఉన్న రైతులకు నోటీసులు జారీ చేసి ఏడు రోజుల లోపు సర్వే పూర్తి చేస్తారని తెలిపారు. ఈ వివరాలను సర్వేయర్ సిస్టంలో నమోదు చేశాక దరఖాస్తుదారుడైన రైతు సర్వే మ్యాప్ నకు యూనిక్, భూధార్ నెంబర్లు కేటాయిస్తారని భూభారతి పోర్టల్ లో కూడా వివరాలు నిక్షిప్తమవుతాయని అన్నారు. సర్వే పూర్తయిన తర్వాత సర్వే మ్యాప్ జనరేట్ చేసి పోర్టల్ లో అప్లోడ్ చేస్తారని ఈ ప్రక్రియలు దరఖాస్తు రిజిస్ట్రేషన్ ప్రారంభమైనప్పటి నుంచి పూర్తి వరకు ప్రతి దశలో పౌరుల రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు మెసేజ్ వస్తాయని తెలిపారు. పైలెట్ ప్రాజెక్టు క్రింద ముందుగా కూసుమంచి మండలంలో ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. భూ సంబంధిత సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని, భూ భారతి కింద ఉన్న దరఖాస్తులన్నింటిని త్వరితగతిన పరిష్కారించేందుకు అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో పాలేరు నియోజకవర్గ స్పెషల్ అధికారి రమేష్, కూసుమంచి మండల తహసీల్దారు సైదులు, కలెక్టరేట్ భూ భారతి సూపరింటెండెంట్ నాగేశ్వరరావు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


