మహిళ మెడలో గొలుసు అపహరణ కేసు నమోదు..
కాకతీయ, గీసుగొండ: ఇంటి ముందు కూర్చొని ఉన్న మహిళ మెడలో నుండి బైక్‌పై వచ్చిన దుండగుడు బంగారు గొలుసు అపహరించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. సీఐ డీ విశ్వేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం దుగ్గొండి మండలం మహ్మదాపురం గ్రామానికి చెందిన పాలడుగుల నర్సమ్మ భర్త చంద్రయ్య తేదీ 12-04-2026న తన కూతురు తాళ్లపల్లి కవిత, అల్లుడు రాజయ్య గృహప్రవేశం సందర్భంగా గీసుగొండ మండలం సూర్య తండా గ్రామానికి వెళ్లి అక్కడే ఉన్నారు.ఈ నెల 15న అల్లుడు,కూతురు బయటకు వెళ్లిన సమయంలో నర్సమ్మ, ఆమె భర్త ఇంటి ముందు కూర్చొని ఉన్నారు. ఇదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ద్విచక్ర వాహనంపై వచ్చి రోడ్డుపై బండి నిలిపి మంచినీళ్లు కావాలని అడిగి దగ్గరకు చేరాడు.అనంతరం మహిళ మెడలో ఉన్న బంగారు పుస్తెల తాడును ఒక్కసారిగా లాక్కొని అక్కడి నుండి పరారయ్యాడు.ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు గీసుగొండ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని సిఐ విశ్వేశ్వర్ తెలిపారు.


