హిందువుల మధ్య విభజనతో నష్టమే
ఆర్‌ఎస్‌ఎస్ కరీంనగర్ విభాగ ప్రచార ప్రముఖ్ శంకరయ్య
కరీంనగర్లో ఘనంగా హిందూ సమ్మేళనం
కాకతీయ,కరీంనగర్ : కరీంనగర్ నగరంలోని కిసాన్ నగర్ బస్తీలో చత్రపతి శివాజీ హిందూ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. గోపూజతో కార్యక్రమం ప్రారంభమై అనంతరం సమ్మేళనం కొనసాగింది. ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా హాజరైన ఆర్‌ఎస్‌ఎస్ కరీంనగర్ విభాగ ప్రచార ప్రముఖ్ తడి గొప్పల శంకరయ్య మాట్లాడుతూ, సమాజంలో కులాల పేరుతో పెరుగుతున్న విభజన హిందువులకు నష్టదాయకమని పేర్కొన్నారు. హిందూ సమాజం ఐక్యంగా ఉన్నప్పుడే దేశం, ధర్మం సుస్థిరంగా ఉంటాయని అన్నారు. ఐకమత్యం లోపిస్తే ప్రపంచంలోని అనేక దేశాలు ఎదుర్కొంటున్న సమస్యల మాదిరిగానే పరిస్థితులు ఏర్పడే అవకాశముందని హెచ్చరించారు.
హిందువులు సంఘటిత శక్తిగా మారాల్సిన అవసరం ఉందని, సనాతన ధర్మ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు. దేశభక్తి, జాతీయ భావం పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. హిందూ ఐక్యతను బలోపేతం చేయాలనే లక్ష్యంతో దేశవ్యాప్తంగా సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సంఘ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్ పిలుపుతో ఈ కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
రాష్ట్ర సేవికా సమితి ప్రాంత శారీరక్ ప్రముఖ్ లెక్కల రమ మాట్లాడుతూ, హిందూ ధర్మం పురాతనమైనదిగా, విశిష్ట చరిత్ర కలిగినదిగా వివరించారు. ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని సూచించారు.
ముఖ్య అతిథి మంగళంపల్లి శ్రీనివాస్ శర్మ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సమ్మేళన కార్యనిర్వహణ సమితి అధ్యక్షుడు పసుల మహిపాల్, గాజుల కృష్ణ, ఎన్నం శ్రీనివాస్, మేంగని రాజయ్యతో పాటు ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, బస్తీ ప్రముఖులు పాల్గొన్నారు.


