పిల్లల హత్య కుట్ర భగ్నం
సొంత పిల్లలను చంపాలని చూసిన తండ్రి
ఫిర్యాదు అందడంతో అరెస్టు చేసిన పోలీసులు
కాకతీయ, జనగామ : జనగామ జిల్లాలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. సొంత పిల్లలను హత్య చేయాలని కుట్ర పన్నిన తండ్రి శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. రఘునాథపల్లి మండలం పొట్టిగుబ్బడి తండాలో ఈ ఘటన చోటుచేసుకుని స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. తరిగొప్పుల మండలం ఆంక్షాపూర్ గ్రామానికి చెందిన అనిత తన ఇద్దరు కుమారులతో కలిసి నివసిస్తోంది. ఏడాది క్రితం శ్రీనివాస్ మరో మహిళ మమతను రెండో వివాహం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో అనిత ఫిర్యాదు చేయగా, పెద్దల సమక్షంలో జరిగిన పంచాయతీలో పిల్లల పేరిట 20 గుంటల వ్యవసాయ భూమిని రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయించారు. అప్పటి నుంచి అనిత ఆ భూమిని సాగు చేసుకుంటూ పిల్లలను పోషిస్తోంది. అయితే, కొంతకాలానికి శ్రీనివాస్ ఆ భూమిని తిరిగి తనకు ఇవ్వాలని ఒత్తిడి చేయడం ప్రారంభించాడు. దీనిపై అనిత మరోసారి పోలీసులను ఆశ్రయించింది. భూమి దక్కించుకోవాలనే ఉద్దేశంతో శ్రీనివాస్ తన రెండో భార్య మమతతో కలిసి దారుణ కుట్ర పన్నాడు. స్కూల్‌కు వెళ్లే తన ఇద్దరు పిల్లలకు విషం కలిపిన బిస్కెట్లు తినిపించి హత్య చేయాలని యత్నించాడు. ఇందుకోసం ఒక వ్యక్తికి సుపారీ ఇచ్చినట్లు వెల్లడైంది. అయితే, ఆ వ్యక్తి మానవత్వంతో వ్యవహరించి ఈ కుట్రను అనితకు తెలియజేయడంతో ప్రమాదం తప్పింది. వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు శ్రీనివాస్, మమతలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనపై రెండు మండలాల తండాల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, తండాకు మళ్లీ రానివ్వకూడదని డిమాండ్ చేస్తున్నారు.


