జ్యూస్ తాగితే చాక్లెట్ ఇస్తా..
మాయమాటలు చెప్పి చిన్నారికి యాసిడ్ తాగించిన పిన్ని
తన కొడుకుని చిన్న చూపు చూస్తున్నారనే నెపంతో తోటికోడలి కుమారుడిపై కక్ష
నాలుగేళ్ల బాలుడిపై గతంలోనూ రెండు సార్లు హత్యాయత్నం
పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు
మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అమానుష ఘటన
కాకతీయ, తెలంగాణ బ్యూరో: పిల్లాడిని ఆడించి, లాలించడంలో తల్లితో పాటు పిన్ని కూడా కీలకంగా వ్యవహరిస్తుంది. ప్రతి కుటుంబంలో పిన్ని అంటే తల్లి తర్వాత మరో తల్లిగా భావించాలని మన కుటుంబ వ్యవస్థ చెబుతోంది. అయితే అంతటి బంధాన్ని ఓ మహిళ తన అసూయతో చెరిపేసింది. తన కొడుకును ఇంట్లో చిన్నచూపు చూస్తున్నారనే నెపంలో తోడికోడలి కుమారుడిపై దారుణానికి ఒడిగట్టింది. నాలుగు సంవత్సరాల వయసున్న చిన్నారికి ఆమె యాసిడ్ తాగించింది. ఈ ఘటన మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బోడుప్పల్ శ్రీనివాస కాలనీలో ఉండే పర్వతం సతీశ్ కుమార్, అంజమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి ఇద్దరు కుమారులు నాగరాజు, జగదీశ్ ఉన్నారు. కాగా వారిద్దరికి వివాహాలు జరిగాయి. వారికి పిల్లలూ ఉన్నారు. అంతా ఉమ్మడి కుటుంబంలా ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఇలాంటి సంతోషకరమైన కుటుంబంలో ఓ విషాదం చోటు చేసుకుంది. ఇంతవరకు బాగానే ఉన్నా ఇంటిలో పెద్దకుమారుడికి కూడా కొడుకున్నాడు. అతడంటే సతీశ్‌కు ఎనలేదని ప్రేమ. దీంతో పెద్ద కుమారుడి కొడుకు (4)పై తాత ఎక్కువ ప్రేమ చూపించడాన్ని చిన్న కోడలు మంజుల సహించలేకపోయింది. మరోవైపు తన బిడ్డను తాత పట్టించుకోకపోవడంతో బాధిపడింది. అయితే వారికి ఎలాగైనా బాద్ధి చెప్పాలని భావించింది. పచ్చబొట్టు వేయించుకున్నారనే నెపంతో మరింత ఆగ్రహం : అయితే ఇటీవల తాత తన చేతిపై పెద్ద కుమారుడి కొడుకు పేరును పచ్చబొట్టు వేయించుకున్నారు. దీంతో అగ్నికి ఆజ్యం పోసినట్టు అయింది. తోటి కోడలి కుమారుడిని హత్య చేయడమే ఈ సమస్యకు సరైన పరిష్కారమని భావించింది. చిన్నారిని హత్య చేసేందుకు అనేక పథకాలు రచించింది. దీనికోసం అనేక ప్రయత్నాలు చేసింది. అయితే ఈ విషయం ఎవరీ తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా తన పని కానిచ్చింది.
ఊపిరాడకుండా చేయాలని భావించి..
వాటిలో మొదటి ప్రయత్నంగా ఇంట్లో చిన్నారిని ఊపిరాడకుండా చేయాలని భావించి అతడి నోరు, ముక్కు మూసింది. చేతులను గట్టిగా పట్టుకుంది. అయితే ఈ ఘటనను బాలుడి తల్లి గమనించింది. ఆమె ఒక్కసారిగా ప్రశ్నించడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. వెంటనే ఆడుకుంటున్నామని అబద్ధం చెప్పి తప్పించుకుంది. అది మొదటిసారి కావడంతో తనకూ అనుమానం కలగలేదు. ఆమె చెప్పిన మాటలు నిజమని నమ్మింది. అయితే మరోసారి ఆ బాలుడిని హత్య చేసేందుకు ఇంటిపై అంతస్తుకు తీసుకెళ్లింది. చిన్నారిని రెయిలింగ్‌పై కూర్చోపెట్టింది. ఇది గమనించిన తాత ఆమెను గట్టిగా మందలించాడు. పిల్లాడిని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయినా ఆమె బుద్ధి మారలేదు. చివరిగా మూడోసారి ప్రయత్నించింది. ఈ నెల 9న మంజుల అతడిని కిచెన్‌లోకి తీసుకెళ్లింది. చిన్నారితో ప్రేమగా మాట్లాడి జ్యూస్ తాగితే చాక్లెట్ ఇస్తానని చెప్పింది. పిన్ని చెప్పిన మాటలు నమ్మిన ఆ బాలుడు ఆమె చెప్పినట్టే చేశాడు. అయితే ఆమె జ్యూస్ ఇవ్వకుండా యాసిడ్ తాగించింది. జ్యూస్ తాగటంతో చిన్నారి అస్వస్థతకు గురయ్యాడు. బాలుడి పరిస్థితి గమనించిన తల్లిదండ్రులు అతడిని దగ్గరలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. బాలుడు యాసిడ్ తాగినట్లు వైద్యులు పేర్కొన్నారు. దీంతో బుధవారం రాత్రి చిన్నారి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


