కిడ్నాప్ కేసులకు నిందితులకు రిమాండ్
కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా మల్లంపల్లి మండలం రామచంద్రపూర్ గ్రామంలో కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన రుద్రరపు శివ ప్రేమ వివాహం చేసుకోవడంతో కోపం చెందిన యువతి అన్న గూగులోత్ రాజేష్ తన స్నేహితులు కొర్ర సునీల్, అరవింద్, హరికృష్ణ, హరిదాసుతో కలిసి ఈ దారుణానికి పాల్పడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం ఏప్రిల్ 15వ తేదీ తెల్లవారుజామున ఉదయం సుమారు 5 గంటల సమయంలో నిందితులు రామచంద్రపూర్ గ్రామానికి చేరుకుని, శివ తండ్రి ఐలయ్యపై దాడి చేసి బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని కిడ్నాప్ చేశారు. అనంతరం ఆయనను విపరీతంగా కొట్టినట్లు సమాచారం. ఈ ఘటనపై బాధితుని భార్య రుద్రరపు సునీత పోలీసులకు ఫిర్యాదు చేయగా, ములుగు ఎస్సై యు. ఉపేందర్ రావు వెంటనే స్పందించారు. కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను వెంబడించారు. మల్లంపల్లి ప్రాంతంలో ఆటోలో పారిపోతున్న నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని, వారిని ములుగు జెఎఫ్‌సీఎం కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. ఈ సందర్భంగా ఎస్సై ఉపేందర్ రావు మాట్లాడుతూ చట్ట విరుద్ధ చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని తెలిపారు.


