వేం నరేందర్ రెడ్డికి ఇనుగాల శుభాకాంక్షలు
కాకతీయ, హనుమకొండ : తెలంగాణ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డి గురువారం న్యూఢిల్లీలో పార్లమెంట్ వేదికగా రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి హాజరై, నరేందర్ రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇనగాల వెంకట్రామ్ రెడ్డి మాట్లాడుతూ.. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నరేందర్ రెడ్డి పెద్దల సభలోకి ప్రవేశించడం సంతోషకరమని పేర్కొన్నారు. ఆయన ప్రాతినిధ్యం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు, ముఖ్యంగా వరంగల్ ప్రాంత అభివృద్ధికి కేంద్ర స్థాయిలో మరింత బలం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వరంగల్ మహానగర పాలక సంస్థ మేయర్, వివిధ జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షులు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా తెలంగాణ నుంచి ఎన్నికైన మరో ప్రముఖ నాయకుడు అభిషేక్ మను సింఘ్వీ కూడా ఇదే రోజు రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి ఎన్నికైన మొత్తం 16 మంది సభ్యులు ఈ కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేయడం విశేషం.


