మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు పెంచాలి
కొనుగోళ్లకు పరిమితిని ఎత్తివేయాలి
రైతు సంఘం రాష్ట్ర నాయకులు నున్నా నాగేశ్వరరావు
కాకతీయ,ఖమ్మం : జిల్లాలో రెండు లక్షల ఎకరాల విస్తీర్ణంలో మొక్కజొన్న సాగు చేసి పంట అమ్ముకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు నున్నా నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు అన్నారు. ఖమ్మం సుందరయ్య భవన్ లో తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ నిర్వహించిన మీడియా సమావేశంలో నున్నా నాగేశ్వరరావు, బొంతు రాంబాబు మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో 17 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన అధికారులు బుధవారం వరకు నాలుగు కొనుగోలు కేంద్రాల్లో ఒక గింజ కూడా కొనుగోలు చేయలేదని అన్నారు. కొన్ని కొనుగోలు కేంద్రాలకు మార్క్ ఫెడ్ ఐడి నెంబర్ కూడా క్రియెట్ చేయలేదని అన్నారు. సత్తుపల్లి నియోజకవర్గం లో ఒక మొక్కజొన్న కొనుగోలు కేంద్రం మంజూరు లేదని దుయ్యబట్టారు. వైరా నియోజకవర్గంలో ఒకటి ప్రారంభం చేసిన అధికారులు రెండోవ సెంటర్ కు ఐడి నెంబర్ ఇవ్వలేదని అన్నారు. జిల్లా లో ఇప్పటివరకు 1982 మంది రైతులు నుంచి మొక్కజొన్న కొనుగోలు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో ఎనిమిది లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉందని, మొత్తం పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎకరాకు 26 క్వింటాళ్ల నిబంధన ఎత్తివేయాలి అని అన్నారు. కౌలు రైతులు చాలా తీవ్రంగా నష్టపోతున్నారు. భూ పట్టాదారు నేరుగా కొనుగోలు కేంద్రాలకు వచ్చి వేలిముద్రలు బయైమెట్రిక్ చేయాలని ప్రభుత్వం నిబంధన వల్ల భూ యజమానులు ఇతర రాష్ట్రాలు,ఇతర దేశాల్లో ఉండటం వల్ల పంట అమ్ముకోలేని పరిస్థితి ఉందన్నారు. కొందరి వేలిముద్రలు బయైమెట్రిక్ తీసుకోవడం లేదు అన్నారు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేసిన మిల్లులు ఎలాట్ లేకపోవడం, మిల్లర్లు ధాన్యం దిగుమతి కి అంగీకారం లేకపోవడం వల్ల ధాన్యం కొనుగోలు కూడా జరగడం లేదని అన్నారు. రైతులకు అవసరమైన గన్ని సంచులు సరఫరా చేయాలి అని డిమాండ్ చేశారు. జిల్లా లో మొక్కజొన్న, వరి సాగు దృష్టిలో ఉంచుకొని అవసరమైన ప్రతి రెవెన్యూ గ్రామంలో మొక్కజొన్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. సమావేశంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ కె మీరా, వాసిరెడ్డి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు


