అలర్ట్!
రాబోయే 3 రోజులు మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లొద్దు
ఆరోగ్య శాఖ హెచ్చరికలు
రాష్ట్రంలో ఠారెత్తిస్తున్న ఎండలు
వచ్చే మూడు రోజులు పలు జిల్లాల్లో వడగాలులు
అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న ఐఎండీ
ఆస్పత్రుల్లో అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలి
ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు
కాకతీయ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పెరుగుతున్న ఎండలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిర్మల్ జిల్లాలోని తానూరులో 43.5 డిగ్రీలు, నిజామాబాద్ జిల్లా భీంగల్‌లో 43.2 డిగ్రీలు నమోదయ్యియి. కామారెడ్డి జిల్లాలోని మద్నూల్, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్, మంచిర్యాల జిల్లాలోని భీమారం, నల్గొండ జిల్లాలోని అడవి దేవులపల్లిలో 43.4 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లాలోని మల్లాపూర్, ఆదిలాబాద్ జిల్లా జైనథ్‌లో 43 డిగ్రీల మేరకు ఉష్ణోగ్రతలు ఉన్నాయి. రానున్న మూడు రోజులు ఉష్ణోగ్రతలు ఒకటి నుంచి రెండు డిగ్రీలు పెరిగే అవకాశముందని హైదరాబాద్ ఐఎండీ కేంద్రం వెల్లడించింది. బుధవారం 33 కేంద్రాల్లో 41 నుంచి 43.5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది. ‘ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సగటున 43.3 డిగ్రీలు నమోదయ్యింది. గురువారం ఆదిలాబాద్, కుమురం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశముంది. శుక్ర, శనివారాల్లో సైతం పై జిల్లాలతో పాటు నారాయణపేట, జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాలో వడగాలులు వీస్తాయ’ని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల మేర నమోదయ్యే అవకాశముందని వాతావరణ విభాగం పేర్కొంది.
అప్రమత్తమైన ఆరోగ్య శాఖ
తెలంగాణలో రాబోయే 3 రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. వడదెబ్బ బాధితులకు సత్వరమే చికిత్స అందించే విధంగా ఆస్పత్రుల్లో అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్య బయటకు వెళ్లొద్దని సూచించారు. దీంతోపాటు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆసుపత్రులకు, ప్రజలకు సూచిస్తూ వైద్యారోగ్యశాఖ బుధవారం ఒక ప్రకటనను విడుదల చేసింది.
ఆరోగ్యశాఖ సూచించిన జాగ్రత్తలు ఇవే :
ప్రజలు మధ్నాహ్నం 12-3 గంటల మధ్య బయటకు వెళ్లకూడదు
రోజూ తగినంత ఓఆర్ఎస్, మజ్జిగ, నిమ్మరసం తీసుకోవాలి
బయటకు వెళ్లేటప్పుడు తలకు టోపీ, టవల్ లాంటివి ధరించాలి
ఆయిల్, మసాలా ఫుడ్ తినడం తగ్గించాలి
వడదెబ్బ లక్షణాలు గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలి
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐవీ ఫ్లూయిడ్స్, అవసరమైన మందులు సిద్ధం చేసుకోవాలి
గ్రామాల్లో ఏఎన్ఎం, ఆశా సిబ్బంది ద్వారా ఓఆర్ఎస్ పంపిణీ ముమ్మరం చేయాలి
లక్షణాలు :
శరీర ఉష్ణోగ్రత అధికంగా పెరగడం
తల తిప్పడం
వాంతులు
గుండె వేగంగా కొట్టుకోవడం
అపస్మారక స్థితికి చేరుకోవడం
పైన వివరించిన లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాలని ఆరోగ్య శాఖ సూచించింది.
సత్వర చికిత్స అందించేందుకు ఏర్పాట్లు
వడ దెబ్బ బాధితులకు వేగవంతమైన, మెరుగైన వైద్య చికిత్సను అందించేందుకు వీలుగా అన్ని హాస్పిటల్స్‌లో ప్రత్యేకంగా డాక్టర్ల బృందాలు ఏర్పాటు చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. జూబ్లీహిల్స్‌లోని రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో బుధవారం ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జడ్ చొంగ్తు, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ డా. గౌరవ్ ఉప్పల్ పలువురు అధికారులు పాల్గొన్నారు.
ప్రజలకు అవగాహన కల్పించండి :
అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఔట్ పేషెంట్లు, ఔట్ పేషెంట్ల వారి అటెండ్లెంట్లు, ఆస్పత్రి సిబ్బందికి తాగు నీరు అందుబాటులో ఉంచాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అవసరమైన చోట చలివేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఉక్కపోత సమస్య ఎక్కువవుతున్నందున ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లను అందుబాటులో ఉంచాలన్నారు. వడ దెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఉపాధి హామీ కూలీలు, వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, కార్మికులు వడ దెబ్బ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వారిని దృష్టిలో పెట్టుకుని అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పేషెంట్ వచ్చిన వెంటనే చికిత్స ప్రారంభించే విధంగా ప్రత్యేక బృందంలోని సిబ్బందికి అవసరమైన శిక్షణను ఇవ్వాలన్నారు. అన్ని ఆసుపత్రుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు.


