నేడో.. రేపో?
అతి త్వరలో నామినేటెడ్ పదవులు !
రేవంత్ ఢిల్లీ టూర్ ముగియగానే ప్రకటన?
రెండు మూడు రోజుల్లోనే బీసీ కులాల సమాఖ్యలకు చైర్మన్లు!
పాలక మండళ్లకు సంబంధించిన పోస్టులు కూడా భర్తీ
పదవులు ఎవరిని వరిస్తాయోనని ఆశావహుల్లో ఉత్కంఠ
కార్పొరేషన్ చైర్మన్ల పదవీకాలం త్వరలో పూర్తి
సరిగా పనిచేయని వారి స్థానంలో కొత్త వాళ్లకు ఛాన్స్?
నాయకుల్లో మళ్లీ చిగురిస్తున్న ఆశలు
ఈసారి మహిళలకు అధిక ప్రాతినిధ్యం..
కాకతీయ, తెలంగాణ బ్యూరో: పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకు వెంటనే నామినేటెడ్ పదవులు ఇవ్వాలని రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు నిర్ణయించడంతో పదవులు ఎవరిని వరిస్తాయోనని ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. నామినేటెడ్ పోస్టులతోపాటు కార్పొరేషన్ చైర్మన్లు, పాలక మండళ్లకు సంబంధించిన పోస్టులను కూడా భర్తీ చేయాలని నిర్ణయించడంతో నాయకుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు విడుదల కానుండటంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతానికి నాయిబ్రాహ్మణ, పద్మశాలి, రజక తదితర కులాలకు చెందిన కార్పొరేషన్లలోని పోస్టులనే భర్తీ చేయనున్నట్లు సమాచారం. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌తో సీఎం బుధవారం కీలక సమావేశాన్ని నిర్వహించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో దాదాపు నాలుగు గంటలపాటు వారు పలు అంశాలపై చర్చించారు. ఈభేటీలోనే టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, కార్యదర్శులు, ఇతర ఆర్గనైజర్ల పోస్టుల భర్తీపై కూడా చర్చించినట్లు తెలిసింది. మండల, బూత్ లెవల్ కమిటీల ఏర్పాటుకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
‘ఒక్కరికి కేవలం ఒక పదవే…’
కాగా కార్పొరేషన్లతోపాటు పార్టీ పదవులను భర్తీ చేసేటప్పుడు క్రియాశీలకంగా ఉన్న జిల్లాలు, అక్కడి సామాజిక సమీకరణాలు, పార్టీ కోసం పనిచేసిన నేతలు తదితరాంశాలపై జాబితాను రూపొందించాలంటూ సీఎం సూచించారు. ‘ఒక్కరికి కేవలం ఒక పదవే…’ అనే సూత్రాన్ని పక్కాగా, తూ.చా. తప్పకుండా పాటించాలంటూ కోరారు. ఇదే విధంగా భవిష్యత్ అవసరలను దృష్టిలో ఉంచుకుని సామాజిక సమీకరణాలు, పొందికలపై దృష్టి సారించాలని సమావేశంలో నిర్ణయించారు. ఇప్పటికే కార్పొరేషన్ చైర్మెన్లు, ప్రభుత్వ సలహాదారుల పోస్టుల కోసం వందలాది మంది దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం. ఆ జాబితాను సాధ్యమైనంతగా వడబోసి, పార్టీకి విధేయులుగా ఉండి, ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకోసం పని చేసి, క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న వారిని గుర్తించాలని భావిస్తున్నారు. వారిలోంచి మొదటి దఫాగా 20 నుంచి 25 మందికి పదవులను కట్టబెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇదే సమయంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక తరగతులకు ప్రాధాన్యతనిస్తూనే రెడ్డి సామాజిక తరగతిని కూడా ‘సంతృప్తి’ పరిచే విధంగా జాబితాలను సిద్ధం చేయాలని సీఎం… పీసీసీ చీఫ్‌కు విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. కాగా కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో కనీసం 30 శాతం మహిళలకు కేటాయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
దాదాపు 60 కార్పొరేషన్ పదవులు..
ఇప్పటికే పీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అనుబంధ విభాగాల చైర్మన్ పదవులు భర్తీ పూర్తయింది. ఇంకా మిగిలిన వర్కింగ్ ప్రెసిడెంట్లు, కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, కొన్ని అనుబంధ విభాగాల చైర్మన్ల నియామకం మిగిలి ఉంది. ఈ విషయాలను మీనాక్షి నటరాజన్, మహేశ్ కుమార్ గౌడ్‌లు రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కసరత్తు చేసిన వివరాలను పరిశీలించి తక్షణమే కమిటీ కూర్పును పూర్తి చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. త్వరలో ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. కులాలకు సంబంధించిన దాదాపు 15 ఫెడరేషన్ పదవులను భర్తీ చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా దాదాపు 60 కార్పొరేషన్ పదవులు, మహిళా కమిషన్ పదవులను కూడా భర్తీ చేయాలని వీరు నిర్ణయించారు.
సీఎంతో మీనాక్షి, మహేశ్ కుమార్ భేటీ..
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు పీసీసీ రాష్ట్ర నాయకత్వం చొరవ చూపాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు రేవంత్ రెడ్డితో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌లు భేటీ అయ్యారు. దాదాపు నాలుగున్నర గంటలపాటు ఈ సమావేశం కొనసాగింది.తాజా రాజకీయ పరిణామాల నుంచి పీసీసీ పూర్తిస్థాయి కమిటీ కూర్పు వరకు అనేక అంశాలపై వీరి మధ్య అంశాల వారీగా చర్చ జరిగినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పీసీసీ పూర్తిస్థాయి కమిటీని వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.


