తురకగూడెంకు తాగునీటి శాశ్వత పరిష్కారం
సొంత బోరుబావి నీటిని గ్రామానికి మళ్లించిన సర్పంచ్
పనుల్లో స్వయంగా పాల్గొని ఆదర్శంగా నిలిచిన బుర్ర కృష్ణ
కాకతీయ, కూసుమంచి : తురకగూడెం గ్రామంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సర్పంచ్ బుర్ర కృష్ణ స్వయంగా రంగంలోకి దిగారు. గ్రామంలో సరైన బోరుబావి లేకపోవడంతో ఇంతవరకు పాలేరు నుండి వచ్చే మిషన్ భగీరథ నీటిపైనే ప్రజలు ఆధారపడి ఉండేవారు. పైప్‌లైన్లలో లోపాలు తలెత్తితే సరఫరా నిలిచిపోవడం వల్ల గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. గ్రామ సమస్యను గమనించిన సర్పంచ్ తన సొంత బోరుబావి నుండి నీటిని గ్రామానికి అందించేలా చర్యలు చేపట్టారు. గ్రామపంచాయతీ సిబ్బందితో కలిసి కొత్త వాటర్ పైప్‌లైన్ల ఏర్పాటులో స్వయంగా పాల్గొన్నారు. బోరుబావి నుండి గ్రామానికి నీరు చేరేలా పైప్‌లైన్ వ్యవస్థను ఏర్పాటు చేయించారు. సర్పంచ్ పదవికి తగిన దర్పం చూపకుండా సాధారణ వ్యక్తిలా పనుల్లో పాల్గొనడం గ్రామస్తులను ఆకట్టుకుంది. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించినందుకు బుర్ర కృష్ణకు పలువురు అభినందనలు తెలియజేస్తున్నారు.


