ఆసుపత్రుల్లో వసతులు మెరుగుపరచాలి
తాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు
ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
రబీ ధాన్యం సేకరణ, రోడ్డు భద్రతపై అధికారులతో సమీక్ష
కాకతీయ,ఖమ్మం: జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా వసతులు మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్యసేవలు, రబీ ధాన్యం సేకరణ, త్రాగునీటి సరఫరా, రోడ్డు భద్రత పనులపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని, విధుల్లో నిర్లక్ష్యాన్ని సహించబోమని కలెక్టర్ స్పష్టం చేశారు. వేసవిలో త్రాగునీటి ఎద్దడి లేకుండా మిషన్ భగీరథ ద్వారా ముందస్తు కార్యాచరణ చేపట్టాలని, హ్యాండ్‌పంప్‌ల మరమ్మత్తులు, నీటివనరుల గుర్తింపు పూర్తి చేయాలని సూచించారు. రబీ సీజన్ ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేయాలని, కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. అలాగే ప్రమాద ప్రాంతాల్లో రోడ్డు భద్రతా చర్యలు చేపట్టి బ్లాక్‌స్పాట్‌ల వద్ద సైన్‌బోర్డులు, రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.


