ఇద్దరి మానసిక హింసకు మహిళా కానిస్టేబుల్ బలి
అనుమానం–బ్లాక్ మెయిల్‌తో నరకం
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : ప్రేమ వ్యవహారం ముసుగులో సాగిన నిరంతర వేధింపులు ఒక మహిళా కానిస్టేబుల్ ప్రాణాన్ని తీసుకున్నాయి. వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఏఆర్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం సీత్యతండాకు చెందిన అనిత అనే మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇద్దరు యువకుల మానసిక వేధింపులు తట్టుకోలేక ఆమె గడ్డి మందు తాగి ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కొమ్మనపల్లి తండాకు చెందిన దూరపు బంధువు రాజేందర్ గత నాలుగేళ్లుగా తనను పెళ్లి చేసుకుంటానని చెప్పుతూ అనితను వేధించినట్లు విచారణలో తేలింది. డ్యూటీలో ఉన్నప్పుడూ వీడియో కాల్ చేయాలని, ఇతరులతో సన్నిహితంగా మాట్లాడవద్దని ఆంక్షలు పెట్టడంతో పాటు అనుమానంతో మానసికంగా హింసించాడని పోలీసులు తెలిపారు.
తల్లిదండ్రుల నిరాకరణతో..!
రాజేందర్ ప్రవర్తన నచ్చక అనిత తల్లిదండ్రులు ఈ వివాహానికి స్పష్టంగా నిరాకరించారు. దీంతో అనితపై ఒత్తిడి మరింత పెరిగింది. ఈ క్రమంలో ఆమె తన స్నేహితుడు *జబ్బార్ లాల్*తో సన్నిహితంగా ఉంటుందని, అతడినే పెళ్లి చేసుకోవాలనుకుంటోందని రాజేందర్ అనుమానించసాగాడు. అనుమానంతో రాజేందర్, జబ్బార్ లాల్‌కు ఫోన్ చేసి అనితపై తప్పుడు సమాచారాన్ని అందించాడు. ఆ తర్వాత జబ్బార్ లాల్ కూడా అనితను వేధించడం ప్రారంభించాడు. డబ్బులు ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని బెదిరిస్తూ బ్లాక్ మెయిల్‌కు పాల్పడ్డాడని పోలీసులు పేర్కొన్నారు. ఇద్దరి మధ్య చిక్కుకున్న అనిత మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురైంది.
చివరి కాల్‌లో కన్నీరు
ఈ వేధింపులు తట్టుకోలేక అనిత రాజేందర్‌కు ఫోన్ చేసి, “మీ ఇద్దరి వల్ల నా జీవితం నాశనం అయింది… చావే దిక్కు” అంటూ కన్నీరు పెట్టుకుంది. అయితే రాజేందర్ “చస్తే చావు” అంటూ నిర్లక్ష్యంగా స్పందించాడని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అదే ఆమెకు చివరి దెబ్బగా మారింది. అనంతరం అనిత గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై రాజేందర్, జబ్బార్ లాల్ ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రేమ పేరుతో జరిగే వేధింపులు ఎంతటి విషాదానికి దారితీస్తాయో ఈ ఘటన మరోసారి గుర్తుచేసిందని అధికారులు వ్యాఖ్యానించారు.


