ఎయిర్‌పోర్ట్ పునరుద్ధరణపై కసరత్తు
వరంగల్‌లో ఏఏఐ అధికారుల కీలక పర్యటన
కలెక్టరేట్‌లో ఉన్నత స్థాయి సమీక్ష
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : చారిత్రక వరంగల్ నగర వాసుల చిరకాల స్వప్నం, మామునూర్ ఎయిర్‌పోర్ట్ పునరుద్ధరణ దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. గురువారం రోజున ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారుల బృందం మామునూర్ ఎయిర్‌పోర్ట్‌ను సందర్శించి, క్షేత్రస్థాయిలో ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. ఎయిర్‌పోర్ట్ సందర్శన అనంతరం, జిల్లా కలెక్టరేట్ చాంబర్‌లో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తో ఏఏఐ అధికారులు ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో అభివృద్ధి పనులపై సుదీర్ఘంగా చర్చించారు. ఎయిర్పోర్ట్ సందర్శనలో తాము గమనించిన అంశాలను ఏఏఐ అధికారులు కలెక్టర్‌కు వివరించారు. రన్‌వే పునరుద్ధరణ పనులకు సంబంధించి ప్రస్తుత రన్‌వే స్థితిగతులు, దానిని ఆధునిక విమానాల రాకపోకలకు అనుగుణంగా విస్తరించే అవకాశం మీద చర్చించారు. ప్రయాణికులకు అవసరమైన టెర్మినల్ భవన నిర్మాణ పనులు మరియు వసతులు ఏర్పాట్ల భద్రత ,సాంకేతికత , విమానాశ్రయ భద్రతా ప్రమాణాలు, ల్యాండింగ్ వ్యవస్థలు మరియు ఇతర సాంకేతిక మెరుగుదలలు మొదలకు పనుల గురించి చర్చించారు.
మామునూర్ ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి చెందితే వరంగల్ జిల్లాలో పారిశ్రామిక మరియు పర్యాటక రంగాలకు భారీ ఊతం లభిస్తుంది. ప్రాంతీయ రవాణా సౌకర్యాలు మెరుగుపడటం వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది.” అని అధికారులు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.
ఈ సమావేశంలో ఎం. రాజా కిషోర్ రీజినల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (రెడ్ ) సౌత్ రీజన్, హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ / జీఎం అచింత కుమార్ దత్తా మరియు ఏజీఎం (ఇంజినీరింగ్-సివిల్) & ల్యాండ్ మేనేజ్‌మెంట్ అధికారి జి. నటరాజు అదనపు కలెక్టర్ జి. సంధ్యారాణి,వరంగల్ ఆర్డీవో సుమ, ఏడీ సర్వే అండ్ ల్యాండ్ శ్రీనివాస్, ఖిలా వరంగల్ తహశీల్దార్ ఇక్బాల్ వివిధ శాఖల అధికారులు మరియు సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.


