జాన్‌పాక, ఆదర్శనగర్ అండర్ బ్రిడ్జి పనులు వేగిరం చేయాలి
మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
కాకతీయ, ఖిలా వరంగల్ : గ్రేటర్ వరంగల్ 17వ డివిజన్ పరిధిలోని జాన్‌పాక, ఆదర్శనగర్ ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి పనులను వెంటనే పూర్తి చేయాలని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం జాన్‌పాక, ఆదర్శనగర్ గ్రామాలకు చెందిన ప్రజలు ఆయన నివాసంలో కలిసి బ్రిడ్జి నిర్మాణంపై తమ సమస్యలను వివరించారు. మంజూరైన పది అడుగుల అండర్ బ్రిడ్జిని 3 అడుగులు తగ్గించి ఏడు అడుగులతో నిర్మిస్తున్నారని, అలాగే ముప్పై అడుగుల వెడల్పుతో నిర్మించాల్సిన మరో అండర్ బ్రిడ్జిని కొందరు వ్యక్తులు స్వార్థ ప్రయోజనాల కోసం అడ్డుకుంటున్నారని వారు తెలిపారు. ఈ సందర్భంగా చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం ఆమోదించిన రెండు అండర్ బ్రిడ్జి నిర్మాణాల్లో ఎలాంటి మార్పులు చేయకూడదని స్పష్టం చేశారు. ప్రజల అవసరాలకు విరుద్ధంగా డిజైన్ మార్పులు చేయడం లేదా పనులను అడ్డుకోవడం సహించబోమని హెచ్చరించారు.
కొంతమంది వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనులను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే, చుట్టుపక్కల ఆరు గ్రామాల ప్రజల నుంచి గట్టి ప్రతిఘటన ఎదురవుతుందని ఆయన పేర్కొన్నారు.
ఈ సమావేశంలో కార్పొరేటర్ గద్దె బాబు, బిఆర్ఎస్ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


