ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికపై సమీక్ష
41 పంచాయతీల సమస్యలపై అధికారుల సమగ్ర చర్చ
కాకతీయ, కారేపల్లి : సింగరేణి మండలం పరిధిలోని వైయస్సార్ గార్డెన్‌లో గురువారం నిర్వహించిన 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక సమీక్ష సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. మండలంలోని వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు ఒకే వేదికపై సమావేశమై గ్రామ స్థాయి సమస్యలపై విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశానికి ఎమ్మార్వో ఓరుగంటి వెంకటేశ్వర్లు, ఎంపీడీవో పొన్నూరు శ్రీనివాసరావు, ఎంఈవో దుగ్గిరాల జయరాజు, ఏఓ భట్టు అశోక్ కుమార్, డాక్టర్ మోహన్, వెలుగు కార్యాలయ అధికారి పీడమర్తి వెంకటేశ్వర్లు, దయామణి తదితరులు హాజరయ్యారు. మండలంలోని అన్ని శాఖల పనితీరును సమీక్షిస్తూ, ప్రజలకు అందుతున్న సేవలపై విశ్లేషణ నిర్వహించారు. ప్రత్యేకంగా సింగరేణి మండలంలోని 41 గ్రామపంచాయతీల పరిధిలో తలెత్తుతున్న సమస్యలను సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు భూక్య రంజిత్ కుమార్, సింగరేణి సర్పంచ్ మేదరి వీరప్రతాప్ (టోనీ) వివరంగా ప్రస్తావించారు. తాగునీటి కొరత, రోడ్ల దుస్థితి, పారిశుద్ధ్యం లోపాలు, విద్య, ఆరోగ్య సంబంధిత సమస్యలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. ఈ సమస్యలపై స్పందించిన అధికారులు దశలవారీగా పరిష్కార చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి గ్రామ స్థాయిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే దిశగా సూచనలు జారీ చేశారు. ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారమే ఈ ప్రణాళిక ప్రధాన లక్ష్యమని, అధికారులు తక్షణ చర్యలు తీసుకుని గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉండాలని కోరారు. ఈ సమీక్ష సమావేశం ద్వారా మండలంలోని సమస్యలు ఒకే వేదికపై చర్చకు రావడంతో పాటు, వాటి పరిష్కారానికి చర్యలు ప్రారంభమవుతాయనే ఆశ ప్రజల్లో వ్యక్తమవుతోంది.


