ఎల్లమ్మ తల్లికి నూతన మండపం
భక్తిశ్రద్ధల మధ్య ప్రత్యేక పూజలు, పట్నాలు
కాకతీయ, ఏటూరునాగారం : ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని తాళ్లగడ్డలో ఉన్న శ్రీ రేణుక ఎల్లమ్మ దేవస్థానంలో నూతనంగా నిర్మించిన మండపాన్ని గురువారం ఘనంగా ప్రారంభించారు. కీర్తిశేషులు మోడం సులోచన జ్ఞాపకార్థంగా దాత మూడే వెంకట్ స్వామి ఆధ్వర్యంలో నిర్మించిన ఈ మండపాన్ని భక్తిశ్రద్ధల మధ్య ప్రారంభించడం విశేషంగా నిలిచింది. ప్రారంభోత్సవం సందర్భంగా మూడే వెంకట్ స్వామి తన కుటుంబ సభ్యులతో కలిసి ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి పట్నాలు వేశారు. ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏటూరునాగారం గౌడ సంఘం నాయకులు మూడే వెంకట్ స్వామిని శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఆలయ అభివృద్ధికి ఆయన అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, గౌడ సంఘం నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


