త్రిముఖ పోరు… ఫలితాలపై ఉత్కంఠ!
కాంగ్రెస్–బీఆర్‌ఎస్–బీజేపీ మధ్య హోరాహోరీ
స్థానిక సమస్యలే ఎన్నికల అజెండా
స్వతంత్ర అభ్యర్థులతో మారిన సమీకరణాలు
కీలక మున్సిపాలిటీల్లో ఉత్కంఠభరిత పోటీ
యువత, మహిళల ఓటు నిర్ణయాత్మకం
13న ఫలితాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి
కాకతీయ, వరంగల్ బ్యూరో : ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగిన మున్సిపల్ ఎన్నికలు రాజకీయంగా అత్యంత ఉత్కంఠభరితంగా మారాయి. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ ప్రధాన పార్టీల మధ్య త్రిముఖ పోటీ నెలకొనడంతో ప్రతి మున్సిపాలిటీలో హోరాహోరీ పోరు కనిపించింది. పలు చోట్ల స్వతంత్ర అభ్యర్థులు కూడా రంగంలోకి దిగడంతో రాజకీయ సమీకరణాలు మరింత ఆసక్తికరంగా మారాయి. ఈ ఎన్నికల్లో జాతీయ, రాష్ట్ర స్థాయి రాజకీయాలకన్నా స్థానిక సమస్యలే ప్రధాన చర్చాంశాలుగా నిలిచాయి. పట్టణాభివృద్ధి, మౌలిక వసతుల మెరుగుదల, డ్రైనేజీ సమస్యలు, రోడ్ల మరమ్మతులు, తాగునీటి సరఫరా, స్ట్రీట్ లైట్లు, చెత్త సేకరణ వంటి అంశాలపై అభ్యర్థులు ప్రధానంగా హామీల వర్షం కురిపించారు. ప్రజలు కూడా అభివృద్ధి పనులే కీలకమని స్పష్టంగా చెబుతూ అభ్యర్థుల పనితీరును బేరీజు వేశారు. జిల్లాలో జరిగిన మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఏ ప్రాంతంలో ఏ పార్టీకి ఆధిక్యం ఉండొచ్చనే అంశంపై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ సాగుతోంది. పట్టణ–గ్రామీణ సమీకరణలు, గత ఎన్నికల ఫలితాలు, స్థానిక సమస్యలు, అభ్యర్థుల బలం వంటి అంశాలు ఫలితాలను ప్రభావితం చేసే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రాష్ట్ర నాయకుల విస్తృత ప్రచారం
మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు రాష్ట్ర స్థాయి నేతలను రంగంలోకి దింపాయి. పలు నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు రోడ్‌షోలు, సభలు నిర్వహించి ప్రచారం జోరుగా సాగించారు. ప్రతి పార్టీ తమ అభ్యర్థుల గెలుపు కోసం చివరి క్షణం వరకు కృషి చేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ, స్టేషన్ ఘన్‌పూర్, వర్ధన్నపేట, పరకాల, నర్సంపేట, భూపాలపల్లి తదితర మున్సిపాలిటీల్లో పోటీ తీవ్రంగా ఉంది. కొన్ని వార్డుల్లో అభ్యర్థుల మధ్య తేడా స్వల్పంగా ఉండే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పలుచోట్ల స్వతంత్ర అభ్యర్థులు గెలుపోటములను ప్రభావితం చేసే పరిస్థితి కనిపిస్తోంది. ఈసారి యువ ఓటర్లు, మహిళల ఓటు శాతం గణనీయంగా ఉండటంతో వారి అభిప్రాయాలు ఫలితాలపై ప్రభావం చూపే అవకాశముంది. స్వచ్ఛ పట్టణాలు, పారదర్శక పాలన, ఉపాధి అవకాశాలు వంటి అంశాలు యువతను ఆకర్షించాయి. మహిళలు మౌలిక సదుపాయాల మెరుగుదలపై ఎక్కువగా దృష్టి సారించారు. ప్రచార యుద్ధం ముగిసిన నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి ఫలితాలపై నిలిచింది. ఏ పార్టీకి అధిక స్థానాలు దక్కుతాయో, ఎక్కడ హంగ్ పరిస్థితి ఏర్పడుతుందో అన్నదానిపై రాజకీయ వర్గాల్లో చర్చలు కొనసాగుతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు జిల్లాలోని రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.
పట్టణాల్లో కాంగ్రెస్ – గ్రామాల్లో బీఆర్‌ఎస్ మధ్య పోటీ
హనుమకొండ, వరంగల్ నగరానికి సమీపంలోని మున్సిపాలిటీలు, విద్యావంతులు, ఉద్యోగ వర్గం అధికంగా ఉన్న పట్టణ ప్రాంతాల్లో కాంగ్రెస్‌కు అనుకూల వాతావరణం కనిపిస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో అభివృద్ధి హామీలు, సంక్షేమ పథకాల ప్రభావం ఈ ప్రాంతాల్లో పార్టీకి లాభం చేకూర్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
అయితే గత ఎన్నికల్లో బలంగా ఉన్న నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట, భూపాలపల్లి పరిసర ప్రాంతాల్లో బీఆర్‌ఎస్ గట్టి పోటీ ఇస్తోందని సమాచారం. గ్రామీణ ఓటర్లలో పార్టీకి ఉన్న స్థిరమైన మద్దతు, స్థానిక నాయకుల ప్రభావం బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా మారవచ్చని విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా గత పాలనలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రస్తావిస్తూ బీఆర్‌ఎస్ నేతలు ప్రచారం నిర్వహించారు.
కీలక వార్డుల్లో బీజేపీ ప్రభావం
కొన్ని పట్టణ మున్సిపాలిటీల్లో బీజేపీ కూడా ప్రభావం చూపే అవకాశముందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా పట్టణ మధ్యతరగతి, వ్యాపార వర్గాల్లో బీజేపీకి మద్దతు పెరిగినట్లు ప్రచారం జరుగుతోంది. కొంతమంది అసంతృప్తి ఓటర్లు బీజేపీ వైపు మళ్లే అవకాశముందనే అంచనా ఉంది. అయితే ఇది కొన్ని కీలక వార్డులకే పరిమితమవుతుందని భావిస్తున్నారు. పార్టీల ప్రభావం ఎంత ఉన్నా, అభ్యర్థుల వ్యక్తిగత ఇమేజ్, స్థానిక సమస్యలపై స్పందన, అభివృద్ధి హామీలు వంటి అంశాలే తుది ఫలితాలపై ప్రభావం చూపుతాయని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. కొన్ని చోట్ల తిరుగుబాటు అభ్యర్థులు, స్వతంత్రుల పోటీ కూడా ప్రధాన పార్టీల గెలుపోటములను ప్రభావితం చేసే అవకాశం ఉంది.
మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారి ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోటీకి వేదికయ్యాయి. ఇప్పుడు అందరి చూపు ఫిబ్రవరి 13న వెలువడే ఫలితాలపైనే నిలిచింది.


