అరైవ్ అలైవ్‌తో రోడ్ సేఫ్టీపై చైతన్యం
ట్రాఫిక్ నియమాలు పాటించాలి
పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం
కాకతీయ, శంకరపట్నం : మండలంలోని మొలంగూర్ గ్రామంలో సోమవారం ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా కేశవపట్నం పోలీసుల ఆధ్వర్యంలో “అరైవ్ అలైవ్” రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక ప్రజలు, వాహనదారులు, ఆటో డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “అరైవ్ అంటే వెళ్లడం కాదు… ఆలైవ్ అంటే సురక్షితంగా తిరిగి రావడం” అని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరి బాధ్యత కీలకమని తెలిపారు. అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, ట్రాఫిక్ నియమాలను పాటించకపోవడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ వినియోగం, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం వంటి అంశాలపై ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. డ్రైవర్లతో కలిసి ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆటో డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డ్రైవర్లకు చూపు సరిగ్గా ఉండటం ఎంత ముఖ్యమో వివరించి, అవసరమైన వారికి వైద్య సూచనలు అందించారు. అదేవిధంగా హెల్మెట్లు పంపిణీ చేశారు. ప్రజలందరూ ట్రాఫిక్ నియమాలను పాటించి ప్రమాదాలను తగ్గించడంలో భాగస్వాములు కావాలని అధికారులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పూదరి రాజు, ఉప సర్పంచ్ దండు రాకేష్, ఏసీపీ మాధవి, సీఐ పులి వెంకట్, ఎస్‌ఐ కట్కూరి శేఖర్ రెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్వో గొట్టే శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


