రైతులు సదుపాయాలు సద్వినియోగం చేసుకోవాలి
ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పిలుపు
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ప్రారంభం
సంగెంలో డీసీసీ బ్యాంక్ బ్రాంచ్ ప్రారంభం
కాకతీయ, పరకాల/గీసుగొండ : రైతులు ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలపడాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి సూచించారు. సోమవారం దామెర మండలం ఊరుగొండ గ్రామంలో పిఎసిఎస్ పెద్దాపురం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే క్వింటాల్‌కు రూ.2400 కనీస మద్దతు ధర లభిస్తుందని తెలిపారు. కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం సంగెం మండల కేంద్రంలోని పి.ఏ.సి.ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నూతన డీసీసీ బ్యాంక్ బ్రాంచ్‌ను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదతో కలిసి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలను విస్తరించడంలో ఈ బ్రాంచ్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. రైతులు, మహిళా సంఘాలు, చిన్న వ్యాపారులు సులభంగా రుణాలు, ఆర్థిక సేవలు పొందేందుకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. తదుపరి గీసుగొండ మండలంలోని ఊకల్ సొసైటీలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి రైతులతో మాట్లాడారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతును ఆర్థికంగా బలోపేతం చేయడమే ధ్యేయమని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయానికి అవసరమైన సదుపాయాలను ప్రభుత్వం అందిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా డీసీఓ నీరజ, తహసీల్దార్లు, వ్యవసాయ అధికారులు, సహకార సంఘాల ప్రతినిధులు, రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.


