మంత్రాల నెపంతో యువకుడిపై ‘సుపారీ’ దాడి!
రూ.5 వేల కోసం కిరాతకం.. వీడియో తీస్తూ పైశాచికానందం
24 గంటల్లోనే కేసు ఛేదించిన మిల్స్ కాలనీ పోలీసులు
ఐదుగురు నిందితుల అరెస్ట్
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్ నగరంలోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన సురేష్ కిడ్నాప్, హత్యాయత్నం కేసును పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించారు. మంత్రాల నెపంతో ఒక యువకుడిని హతమార్చడానికి ఐదు వేల రూపాయల సుపారీ ఇచ్చి దాడి చేయించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను వరంగల్ ఎఎస్పీ శుభం ప్రకాష్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఎస్.ఆర్ నగర్ ప్రాంతానికి చెందిన తాళ్ళపెళ్లి రాములమ్మ అనే మహిళ తన కూతురు ఇటీవల మరణించడానికి సురేష్ చేసిన మంత్రాలే కారణమని అనుమానించింది. ఎలాగైనా అతడిని అంతం చేయాలని భావించిన రాములమ్మ, పాత నేరస్థుడైన కళ్యాణ్‌కు రూ. 5,000 సుపారీ ఇచ్చి సురేష్‌ను చంపాలని ఒప్పందం కుదుర్చుకుంది.
కోటిలింగాల గుడి వద్ద కిరాతకం
పథకం ప్రకారం.. నిందితులు కళ్యాణ్, జగన్ కలిసి సురేష్‌ను ఇంటి సమీపంలోని కిరాణా షాపు వద్ద బలవంతంగా బైక్‌పై ఎక్కించుకుని కోటిలింగాల గుడి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ సురేష్‌పై బండరాయితో తలపైన, శరీరంపైన బాదుతూ కిరాతకంగా దాడి చేశారు. ఈ దారుణాన్ని నిందితుడు జగన్ తన మొబైల్‌లో వీడియో చిత్రీకరించాడు. సురేష్ ప్రాధేయపడుతున్నా వినకుండా కాళ్లతో తన్నుతూ పైశాచిక ఆనందం పొందారు.
చనిపోయాడనుకొని ఇంటి వద్దే వదిలేసి
తీవ్రంగా గాయపడిన సురేష్ స్పృహ కోల్పోవడంతో, అతడు చనిపోయాడని నిందితులు భావించారు. ఆపై మృతదేహాన్ని మాయం చేసేందుకు ప్రయత్నించకుండా, ధైర్యంగా ఒక ఆటోలో వేసుకుని వచ్చి సురేష్ ఉంటున్న గల్లీలోనే పడేసి పరారయ్యారు. కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు రంగంలోకి దిగి నిందితులు చిత్రీకరించిన వీడియో ఆధారంగా సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను గుర్తించారు. తాళ్ళపెళ్లి రాములమ్మ, కళ్యాణ్, జగన్‌తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. దాడికి వాడిన ఆటో, 5 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితులపై గతంలోనే ఏనుమాముల, గీసుగొండ స్టేషన్లలో పలు కేసులు ఉన్నట్లు ఎఎస్పి తెలిపారు. ప్రస్తుతం పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని ఎఎస్పి శుభం ప్రకాష్ హెచ్చరించారు.


