మక్కలు కొనరు…మద్దతు ధర ఇవ్వరు..!
హస్తం సర్కారు పాలనలో అన్నదాత అరిగోస
కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికి రైతు వ్యతిరేక పార్టీ
మద్దతు ధర ఇవ్వాలి… రైతులను ఆదుకోవాలి
చివరి గింజ కొనే వరకు రైతుల పక్షాన పోరాడుతాం
వారం రోజుల్లో మక్కలు కొనుగోలు పూర్తి చేయాలి
లేదంటే పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తాం : మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
కాకతీయ,రాయపర్తి/పాలకుర్తి : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని,దేశానికే అన్నం పెట్టే అన్నదాతను అరిగోస పెడుతోందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రస్థాయిలో విమర్శించారు.గురువారం ఆయన పాలకుర్తి మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ మార్కెట్ యార్డును సందర్శించారు.ఈ నేపథ్యంలో అక్కడున్న రైతులతో ఎర్రబెల్లి ముచ్చటించారు.ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ప్రభుత్వం కొనడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేసారు.గన్నీ బ్యాగులు లేవని…లారీలు సరిగా రావడం లేదని తమ గోడును వెళ్ళబోసుకున్నారు.అక్కడికక్కడే ఎర్రబెల్లి స్పందించి జిల్లా మార్కెటింగ్ అధికారి(డిఎం)తో చరవాణిలో మాట్లాడారు.మక్కల(మొక్కజొన్నలు) కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యం సరికాదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.రైతులు మక్కలు విక్రయించడానికి మార్కెట్ కు తీసుకువచ్చి రోజుల తరబడి ఎదురుచూస్తున్నా ఎందుకు కాంటాలు పెట్టడం లేదని ప్రశ్నించారు.ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ…కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సకాలంలో రైతుబంధు ఇవ్వలేదని…ఇప్పుడు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనకుండా అన్నదాతను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని మండిపడ్డారు.కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికి రైతు వ్యతిరేక పార్టీ అని ఖరాఖండిగా చెప్పారు.మక్కల కొనుగోళ్లలో ప్రభుత్వం వహిస్తున్న నిర్లక్ష్యమే దీనికి నిదర్శనమని అన్నారు.బోనస్ ఇస్తానని చెప్పిన మాటలు అన్ని బోగస్ మాటలే అని ఎద్దేవ చేశారు. మక్కలకు మద్దతు ధర రూ.2400 ఉండగా… ప్రభుత్వం కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర,కర్ణాటకకు వెళ్లి రూ.1600నుండి1700లకే రైతులు తమ పంటను విక్రయించి ఆర్థికంగా నష్టపోతున్నారని వాపోయారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మొద్దునిద్రను వీడి వారం రోజుల్లో మక్కలు కొనుగోళ్లను పూర్తిచేయాలని డిమాండ్ చేసారు.లేదంటే జిల్లా,రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు.


