వచ్చే బీఆర్ ఎస్ ప్రభుత్వంలో క్రీడలకు ప్రాధాన్యం
అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ క్రీడాకారులకు తోడ్పాటు
హన్మకొండ కేసీఆర్ టోర్నీ స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా టోర్నమెంట్లు
బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హన్మకొండ కేసీఆర్ క్రికెట్ కప్-8 విజేతలకు బహుమతులు అందజేత
8 ఏళ్లుగా టోర్నీ నిర్వహణతో క్రీడాకారులకు చేయూత
బీఆర్ ఎస్ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్
కాకతీయ, వరంగల్ బ్యూరో : కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని నిర్వహించిన కేసీఆర్ క్రికెట్ కప్ 8వ ఎడిషన్ పోటీల విజేతలకు బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెక్కులు, ట్రోఫీలను అందజేశారు.
కేసీఆర్ జన్మదినం సందర్భంగా ప్రభుత్వ మాజీ చీఫ్‌విప్, మాజీ ఎమ్మెల్యే, బీఆర్ ఎస్ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు వినయ్‌భాస్కర్ ఆధ్వర్యంలో కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించిన విషయ తెలిసిందే. ఈమేరకు గురువారం హైదరాబాద్ నందినగర్‌లోని కేటీఆర్ నివాసంలో విజేతలకు కేటీఆర్ చేతుల మీదుగా ట్రోఫిని అందజేశారు. అలాగే విజేతలకు బహుమతి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో సమగ్ర క్రీడా పాలసీ అవసరమని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కృషి చేస్తామని తెలిపారు. హన్మకొండలో నిర్వహిస్తున్న కేసీఆర్ క్రికెట్ కప్ స్ఫూర్తితో వచ్చే ఏడాది రాష్ట్రవ్యాప్తంగా పార్టీ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈసందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో గత 8 ఏళ్లుగా కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాలోని పేద క్రీడాకారులకు చేయూతనందిస్తున్నామని చెప్పారు. పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులను, నిర్వహణలో సహకరించిన కాకతీయ క్రికెట్ అకాడమీ సభ్యులను అభినందించారు. టోర్నమెంట్ లో 51వ డివిజన్ జట్టు విజేతగా నిలవగా, 49వ డివిజన్ జట్టు రన్నర్స్‌గా నిలిచింది. డిపార్ట్‌మెంట్ క్రికెట్ విభాగంలో అంజలి కిడ్నీ కేర్ సెంటర్ హాస్పిటల్ జట్టు విజేతగా నిలవగా, సంకీర్తన హాస్పిటల్ జట్టు రన్నర్‌గా నిలిచింది. వీరందరికీ కేటీఆర్ చేతుల మీదుగా నగదు బహుమతులు, ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాకతీయ క్రికెట్ అకాడమీ (కేసీఏ) ఫౌండర్ చైర్మన్ ఫారుక్ అలీ, సభ్యులు మరియు స్థానిక ప్రజా ప్రతినిధులు, క్రీడాకారులు పాల్గొన్నారు.


