బిల్లులు రాక పాఠశాలకు తాళం
ఇల్లంతకుంటలో మాజీ సర్పంచ్ దంపతుల నిరసన
రూ.22 లక్షల పనులకు రెండేళ్లుగా బిల్లులు పెండింగ్
వెంటనే బిల్లులు విడుదల చేయాలని డిమాండ్
కాకతీయ,రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : పెండింగ్ బిల్లులు విడుదల కాకపోవడంతో ఆగ్రహానికి లోనైన మాజీ సర్పంచ్ దంపతులు ప్రభుత్వ పాఠశాల గదులకు తాళం వేశారు.ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో గురువారం చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళ్తే…వల్లంపట్ల గ్రామ మాజీ సర్పంచ్ కేతిరెడ్డి అనసూయ వెంకటనర్సింహారెడ్డి గత ప్రభుత్వ హయాంలో తమ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో రూ.22 లక్షల వ్యయంతో మూడు తరగతి గదులు, ఒక డైనింగ్ హాల్ నిర్మాణం చేపట్టారు.రెండు సంవత్సరాలుగా ఈ పనులకు సంబంధించిన బిల్లులు ప్రభుత్వం నుంచి విడుదల కాలేదు.తమకు రావలసిన పెండింగ్ బిల్లులు చెల్లించాలని పలుమార్లు సంబంధిత అధికారులను వేడుకున్నా ఫలితం లేకుండా పోయింది.దీంతో విసుగు చెందిన మాజీ సర్పంచ్ దంపతులు పాఠశాలలో వారు నిర్మించిన గదులకు తాళం వేశారు.తమకు రావలసిన బిల్లులు చెల్లించే వరకు తాళం తీసే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు.తాము అప్పులు చేసి పాఠశాల తరగతి గదులు,డైనింగ్ హాల్ నిర్మించామని ఆవేదన వ్యక్తం చేశారు.వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.తమ ఇబ్బందులను గుర్తించి ప్రభుత్వం వెంటనే తమకు రావలసిన బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు.


