తిరుమలలో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు
అర్ధరాత్రి నుంచే వైకుంఠద్వార దర్శనం ఆరంభం
గోవింద నామస్మరణతో మారుమోగిన ఏడుకొండలు
కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకున్న సీఎం రేవంత్‌రెడ్డి
తిరుమల : కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వైకుంఠ ఏకాదశి పర్వదిన వేడుకలు తిరుమలలో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. సోమవారం అర్ధరాత్రి తరువాత 1.30 గంటల నుంచి టీటీడీ వైకుంఠద్వార దర్శనాలను ప్రారంభించింది. తొలుత వీఐపీలకు ఉత్తర ద్వారం గుండా దర్శనం కల్పించగా, సాధారణ భక్తులకు ఉదయం 6 గంటల నుంచి దర్శనాలు అందించనున్నారు. తెల్లవారుజాము 2 గంటల నుంచే భక్తులు ఉత్తర ద్వార దర్శనార్థం క్యూ కట్టారు. జనవరి 8వ తేదీ రాత్రి వరకు మొత్తం 10 రోజుల పాటు వైకుంఠద్వార దర్శన భాగ్యం భక్తులకు లభించనుంది.
స్వర్ణరథోత్సవం, చక్రస్నానం
వైకుంఠ ఏకాదశి సందర్భంగా మంగళవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్ప స్వామివారు స్వర్ణరథంపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. బుధవారం ద్వాదశి పర్వదినాన స్వామివారి చక్రస్నానం పుష్కరిణిలో నిర్వహించనున్నారు. మొదటి మూడు రోజులు టైంస్లాట్ టోకెన్లు కలిగిన భక్తులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. తెల్లవారుజాము 1 నుంచి ఉదయం 11 గంటల వరకు: కృష్ణతేజ మార్గం, ఉదయం 11 నుంచి సాయంత్రం 5 వరకు: ఏటీజీహెచ్ మార్గం, సాయంత్రం 5 నుంచి రాత్రి 10 వరకు: శిలాతోరణం మార్గం, జనవరి 2 నుంచి 8 వరకు టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. ఇప్పటికే జారీ చేసిన ఎస్ఈడీ, శ్రీవాణి దర్శన టికెట్లను ఆయా కోటాల మేరకు అమలు చేస్తున్నారు. ఆలయ ప్రాంగణాన్ని సుమారు 50 టన్నుల సంప్రదాయ పుష్పాలు, 10 టన్నుల పండ్లు, లక్షలాది కట్ ఫ్లవర్స్‌తో అద్భుతంగా అలంకరించారు. ఆలయం వెలుపల ఏర్పాటు చేసిన శ్రీరంగనాథస్వామి ఆలయ నమూనా, అష్టలక్ష్ముల సెట్టింగ్‌లు భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.
సీఎం రేవంత్‌రెడ్డి దర్శనం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం రాత్రే తిరుమలకు చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. ఉత్తర ద్వారం గుండా బయటకు వచ్చిన సీఎంకు ఆలయ అర్చకులు శాస్త్రోక్త స్వాగతం పలికారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, అధికారులు స్వాగతం తెలిపారు. దర్శనానంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. వైకుంఠ ఏకాదశి వేడుకలతో తిరుమల గిరులు, ఆలయ ప్రాంగణం గోవింద నామస్మరణతో మారుమోగుతోంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ విస్తృత భద్రత, దర్శన ఏర్పాట్లు చేపట్టింది.


