ఔషధం కాదు.. ! విషం..!!
తెలంగాణలో తయారైన 35రకాల మందులు ఫెయిల్
సీడీఎస్‌సీవో తనిఖీల్లో బయటపడ్డ నాణ్యత లోపాలు
జ్వరం–నొప్పి మందులు కూడా ప్రమాదకరమే..
ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం.. తాజా తనిఖీల్లో లోపాలు బహిర్గతం
నాన్ స్టాండర్డ్ క్వాలిటీ (ఎన్ ఎస్ క్యూ)గా గుర్తింపు
ఫార్మసీల బాధ్యతరాహిత్యం.. తనిఖీలు సక్రమంగా జరగకపోవడమే కారణమా..?!
కాకతీయ, స్పెషల్ డెస్క్ : తెలంగాణలో తయారై దేశవ్యాప్తంగా సరఫరా అవుతున్న అనేక మందుల్లో తీవ్ర నాణ్యత లోపాలు వెలుగుచూడడం కలకలం రేపుతోంది. కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్ సీవో) నిర్వహించిన తాజా తనిఖీల్లో గత ఏడాది కాలంలో రాష్ట్రానికి చెందిన 35 రకాల ఔషధాలు నాణ్యత ప్రమాణాలను అందుకోలేకపోయినట్లు అధికారికంగా తేలింది. ఇవన్నీ నాన్ స్టాండర్డ్ క్వాలిటీ (ఎన్ ఎస్ క్యూ)గా గుర్తించబడ్డాయి. విశేషమేమిటంటే, ఈ మందులన్నీ సాధారణంగా ప్రజలు రోజూ వాడే జ్వరం, నొప్పి, ఇన్ఫెక్షన్లు, గ్యాస్ట్రిక్ సమస్యలకు సంబంధించినవే కావడం ఆందోళన కలిగిస్తోంది. పారాసిటమాల్–ఏసిలోఫెనాక్ కలయికలు, పాంటోప్రాజోల్, రాబెప్రాజోల్, అమోక్సిసిల్లిన్–క్లావులానిక్ యాసిడ్, ఆల్బెండాజోల్ వంటి సాధారణ మందులే పరీక్షల్లో ఫెయిల్ కావడం విస్తుగొలిపే విషయం. కొన్ని ఔషధాలు తప్పుడు లేబులింగ్‌తో (మిస్‌బ్రాండెడ్) మార్కెట్‌లోకి వచ్చినట్లు కూడా అధికారులు గుర్తించారు. ఈ మందులు వాడితే వ్యాధి పూర్తిగా తగ్గకపోవడమే కాకుండా, ఇతర దుష్ప్రభావాలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్నిసార్లు ఇవి రోగుల ప్రాణాలకే ముప్పుగా మారే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సాధారణ మందులే ప్రమాదకరం
ప్రతి ఇంట్లో సాధారణంగా వాడే నొప్పి నివారణ, జ్వర నివారణ మందులే నాణ్యత పరీక్షల్లో విఫలమవడం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. చిన్నపాటి జ్వరం వచ్చినా వెంటనే తీసుకునే పారాసిటమాల్ వంటి మందులు కూడా ప్రమాణాలు చేరుకోకపోవడం తీవ్రమైన అంశంగా మారింది. నాణ్యత లేని మందులు వాడితే వ్యాధి తగ్గకపోవడం, దుష్ప్రభావాలు రావడం, కొన్ని సందర్భాల్లో కిడ్నీ, కాలేయం వంటి అవయవాలపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. అందువల్ల మందుల నాణ్యతపై కఠిన పర్యవేక్షణ అత్యవసరమని నిపుణులు సూచిస్తున్నారు. సీడీఎస్‌సీవో గణాంకాల ప్రకారం, గత ఏడాది ఆగస్టు నెలలోనే అత్యధికంగా నాణ్యత లేని మందులు బయటపడినట్లు వెల్లడైంది. అయినప్పటికీ కేంద్ర స్థాయిలో జారీ అవుతున్న హెచ్చరికలు కేవలం నివేదికలకే పరిమితమవుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
తనిఖీల్లో నిర్లక్ష్యమే కారణమా?
రాష్ట్ర స్థాయిలో కఠిన తనిఖీలు, ఆకస్మిక దాడులు, ప్రతి బ్యాచ్‌కు తప్పనిసరి నాణ్యత పరీక్షలు జరగకపోవడమే ఈ పరిస్థితికి కారణమన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఔషధ తయారీ కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే నాసిరకం మందులు మార్కెట్‌లోకి వస్తున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. సాధారణ ప్రజలు రోజూ నమ్మకంగా కొనుగోలు చేసే మందులే ప్రమాణాలు తక్కువగా ఉండటం ప్రజారోగ్యానికి పెద్ద ప్రమాద సంకేతమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మందుల తయారీ నుంచి మార్కెట్‌లో విక్రయం వరకు పటిష్టమైన పర్యవేక్షణ వ్యవస్థ అవసరమని అభిప్రాయపడుతున్నారు. నాణ్యత లేని మందులు మార్కెట్‌లో తిరుగుతుండటం వల్ల రోగులకు సరైన చికిత్స అందకపోవడమే కాకుండా, అనవసరంగా ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తోందని వైద్యులు అంటున్నారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, నాసిరకం మందులు తయారుచేసే సంస్థలపై కఠిన శిక్షలు విధించాలని నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. ముందస్తు పర్యవేక్షణ పెంచకపోతే మందుల ముసుగులో మృత్యు ప్రమాదం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.


