అధికారం లేనివారితో అభివృద్ధి సాధ్యమా?
స్వతంత్రుల ముసుగులో వస్తే మోసపోవద్దు
‘శీనన్న మనిషిని’ అంటే నమ్మకండి
అభివృద్ధి చేసే శక్తి కాంగ్రెస్‌కే ఉంది
ప్రత్యర్థులకు అధికారం లేదు – పనీ లేదు
కొత్తగూడె కార్పోరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొంగులేటి
కాకతీయ, కొత్తగూడెం : అధికారం లేని ప్రత్యర్థులతో అభివృద్ధి అసాధ్యమని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల వేళ స్వతంత్రుల ముసుగులో వచ్చే కొత్త అవతారాలను ప్రజలు నమ్మవద్దని హెచ్చరించారు. “నాకు శీనన్న తెలుసు… ఆయనకు నేను సన్నిహితుడిని” అంటూ ఓట్లు అడగడానికి వచ్చే వారు వాస్తవానికి ఎవరికీ దగ్గర కాదని తేల్చిచెప్పారు. కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం పలు డివిజన్లలో నిర్వహించిన రోడ్ షోలలో మంత్రి పొంగులేటి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాజకీయ లబ్ధి కోసం తమను సొంత మనుషులుగా చెప్పుకునే వారి పట్ల కార్యకర్తలు, ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం కాంగ్రెస్‌దేనని, అధికారమూ తమదేనని, అభివృద్ధి చేయగల శక్తి కూడా తమ పార్టీకే ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రజలను మభ్యపెట్టేందుకు కొత్త ముసుగులతో వచ్చే వ్యక్తుల మాటలను నమ్మొద్దని పిలుపునిచ్చారు.
అధికారం లేని వారికి ఓటెందుకు?
ప్రతిపక్షాల తీరును తీవ్రంగా ఎండగడుతూ మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేశారు. “ప్రభుత్వం మనది… అధికారం మనది… అభివృద్ధి చేసే సత్తా కూడా మనకే ఉంది. అలాంటప్పుడు అధికారం లేని వారికి ప్రజలు ఎందుకు ఓటేయాలి?” అని ప్రశ్నించారు. ప్రత్యర్థులు గెలిచినా ప్రజలకు ఏం చేయగలరని నిలదీశారు. అభివృద్ధి పనులు చేయాలన్నా, ప్రభుత్వ నిధులు తీసుకురావాలన్నా అది అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికే సాధ్యమని స్పష్టం చేశారు. అధికారం లేకుండా హామీలు ఇచ్చేవారు ప్రజలను మోసం చేయడం తప్ప మరేమీ చేయలేరన్నారు. కొత్తగూడెం అభివృద్ధి కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుతోనే సాధ్యమవుతుందని, ప్రజలు ఈ వాస్తవాన్ని గుర్తించాలని కోరారు. ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయమని మంత్రి వివరించారు.

ఇండ్లు ఇచ్చేది నేనే – పట్టాలు ఇచ్చేది నేనే
తన వద్దే గృహ నిర్మాణం, రెవెన్యూ శాఖలు ఉన్నాయని గుర్తు చేస్తూ మంత్రి పొంగులేటి కీలక హామీలు ఇచ్చారు. ఇండ్లు మంజూరు చేయడం, ఇండ్ల స్థలాల పట్టాలు ఇవ్వడం వంటి అధికారాలు తన చేతిలోనే ఉన్నాయని చెప్పారు. ఏప్రిల్ నెల నుంచి మరో విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ప్రక్రియ ప్రారంభిస్తామని ప్రకటించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని, పేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. అధికారంలో ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమని, ప్రత్యర్థుల మాటలకు తావులేదని కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.
సైనికుల్లా కదలండి
కాంగ్రెస్–సీపీఎం కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ఒక్కో కార్యకర్త సీఎం రేవంత్ రెడ్డిలా, పొంగులేటిలా మారి విపక్షాల కుట్రలను తిప్పికొట్టాలని సూచించారు. స్వతంత్రుల ముసుగులో వస్తున్న మోసకారి శక్తులకు ఈ నెల 11న జరిగే ఎన్నికల్లో ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. కొత్తగూడెంపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులే ప్రజల్లో విశ్వాసం పెంచుతున్నాయని, అదే ఈ ఎన్నికల్లో విజయానికి బాట వేస్తుందని పేర్కొన్నారు. ప్రజలు వాస్తవాలను గ్రహించి సరైన నిర్ణయం తీసుకోవాలని మంత్రి కోరారు. ఈ ప్రచార కార్యక్రమాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు, సీపీఎం నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యకర్తలు ఉత్సాహంగా ర్యాలీలు నిర్వహిస్తూ ప్రచారాన్ని హోరెత్తించారు.


