పేలిపోయిన బతుకులు
వేట్లపాలెంలో బాణసంచా పేలుడు
సూర్యశ్రీ ఫైర్వర్క్స్ కేంద్రంలో ఘోర ప్రమాదం
23 మంది సజీవదహనం! మరో నలుగురి పరిస్థితి విషమం
ఐదు కిలోమీటర్ల దూరం వరకు వినిపించిన పేలుడు శబ్దం
ఫ్యాక్టరీ భవనం పూర్తిగా ధ్వంసం… అధికారుల దర్యాప్తు ప్రారంభం
స్వయంగా ఘటన స్థలాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు
సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశం
మృతుల కుటుంబాలను పరామర్శించిన చంద్రబాబు
సామర్లకోట ప్రభుత్వాసుపత్రిలో ఓదార్పు
“ప్రభుత్వం అండగా ఉంటుంది” అని హామీ
కాకతీయ, ఏపీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లాలో భయానక విషాదం చోటుచేసుకుంది. సామర్లకోట మండలం వేట్లపాలెం పరిధిలో గోదావరి కాలువ పక్కన ఉన్న సూర్యశ్రీ ఫైర్వర్క్స్ బాణసంచా తయారీ కేంద్రంలో శనివారం మధ్యాహ్నం సుమారు రెండు గంటల సమయంలో భారీ పేలుడు సంభవించింది. ఒక్కసారిగా వినిపించిన గర్జనతో పరిసర ప్రాంతాలు వణికిపోయాయి. దట్టమైన పొగలు ఎగసిపడగా, మంటలు ఆకాశాన్ని అంటుకున్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం 18 మంది కార్మికులు అక్కడికక్కడే సజీవదహనమై మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో మరో ఐదుగురు ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. దీంతో మృతుల సంఖ్య 23కు చేరింది. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో సుమారు 30 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. పేలుడు తీవ్రతకు భవనం పూర్తిగా ధ్వంసమైపోయింది. కొందరి మృతదేహాలు ఛిన్నాభిన్నమై చుట్టుపక్కల ఎగిరిపడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఘటనాస్థలమంతా భయానక దృశ్యాలతో నిండిపోయింది.

మంటల్లో చిక్కుకున్న కార్మికులు
పేలుడు అనంతరం మంటలు వేగంగా వ్యాపించడంతో పలువురు కార్మికులు బయటకు పరుగులు తీయడానికి కూడా వీలు లేకుండా మంటల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన ఎనిమిది మందిని అంబులెన్స్‌ల ద్వారా సమీప ఆస్పత్రులకు తరలించారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. మృతుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నట్లు సమాచారం. పేలుడు శబ్దం సుమారు ఐదు కిలోమీటర్ల దూరం వరకు వినిపించినట్లు గ్రామస్తులు తెలిపారు. తీవ్ర ప్రకంపనలకు సమీపంలోని ఓ ప్రైవేట్ పాఠశాల భవన స్లాబ్‌కు పగుళ్లు వచ్చినట్లు తెలిసింది. కొన్ని ఇళ్ల కిటికీలు, గోడలు కూడా దెబ్బతిన్నాయి. ప్రాంతమంతా దట్టమైన పొగతో కమ్ముకుపోయి ఆందోళనకర వాతావరణం నెలకొంది.

కొనసాగుతున్న సహాయక చర్యలు
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్లతో ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. పోలీసులు పరిసర ప్రాంతాలను ఖాళీ చేయించి భద్రతా చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ, కలెక్టర్ స్వయంగా అక్కడికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. పరిమితికి మించి బాణసంచా నిల్వ ఉంచడం లేదా భద్రతా నిబంధనల లోపం కారణంగా ప్రమాదం సంభవించి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే పేలుడు కారణాలపై అధికారిక ప్రకటన వెలువడలేదు. పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం మాత్రమే అసలు కారణాలు వెల్లడికానున్నాయి. ఈ బాణసంచా పరిశ్రమను అడపా నాని కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

సీఎం పరిశీలన
ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించారు. విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన హుటాహుటిన శనివారం సాయంత్రం ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యసాయం అందించాలని ఆదేశించారు. హోం మంత్రి అనిత కూడా అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ దారుణ ప్రమాదంతో వేట్లపాలెం గ్రామం దుఃఖసాగరంలో మునిగిపోయింది. ఒక్కసారిగా కుటుంబాలను కోల్పోయిన వారి ఆర్తనాదాలతో ప్రాంతమంతా మారుమోగింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. అధికారుల పూర్తి నివేదిక వెలువడిన తర్వాత మరిన్ని వివరాలు తెలియనున్నాయి.


మృతుల కుటుంబాలను పరామర్శించిన చంద్రబాబు
సామర్లకోట ప్రభుత్వాసుపత్రిలో ఓదార్పు
“ప్రభుత్వం అండగా ఉంటుంది” అని హామీ
కాకినాడ జిల్లా వేట్లపాలెంలో జరిగిన ఘోర బాణసంచా ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ప్రమాదం జరిగిన అనంతరం సామర్లకోట ప్రభుత్వాసుపత్రికి చేరుకున్న సీఎం, మృతుల కుటుంబ సభ్యులను కలుసుకుని ఓదార్చారు. ఈ సందర్భంగా ఘటన అత్యంత బాధాకరమని పేర్కొన్న ఆయన, ఒక్కసారిగా కుటుంబాలను కోల్పోయిన బాధితుల ఆవేదనను వ్యక్తిగతంగా అర్థం చేసుకుంటున్నానన్నారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యసాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలను సమగ్రంగా విచారించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన భద్రతా నిబంధనలు అమలు చేయాల్సిన అవసరం ఉందని అధికారులకు సూచించారు. సీఎం పరామర్శతో బాధిత కుటుంబాలకు కొంత ధైర్యం కలిగిందని స్థానికులు పేర్కొన్నారు. వేట్లపాలెం విషాదంతో దిగ్భ్రాంతిలో ఉన్న గ్రామంలో సీఎం పర్యటన కొంత మానసిక భరోసా కలిగించినట్లు తెలుస్తోంది.


