కాకతీయ, తెలంగాణ బ్యూరో: కాకినాడ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సామర్లకోట మండల పరిధిలో బుధవారం చోటుచేసుకున్న దారుణ ఘటన స్థానికులను షాక్‌కు గురిచేసింది. గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామానికి చెందిన 17 ఏళ్ల విద్యార్థిని దీప్తిపై దాడి చేసి చంపిన 19 ఏళ్ల యువకుడు అశోక్ తర్వాత రైల్వే ట్రాక్ వద్ద మృతదేహంగా పడి ఉండటం కలకలం రేపుతోంది.
పోలీసులు తెలిపిన పూర్తి వివరాలు ప్రకారం.. దీప్తి ఇంటర్ చదువుతోందని, అశోక్ కొంతకాలంగా ఆమెను ఇష్టపడుతున్నాడని తెలుస్తోంది. మంగళవారం దీప్తి బంధువుల ఇంటికి కాకినాడకు వెళ్లినప్పుడు, అశోక్ ఆమెను సామర్లకోట మండలంలోని పనసపాడు గాడేరు కాలువ గట్టు వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ పదునైన బ్లేడ్‌తో దాడి చేసి దారుణంగా చంపాడు. తర్వాత అశోక్ అక్కడి నుంచి పారిపోయాడు. బుధవారం హుస్సేన్‌పురం సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద అతని మృతదేహం కనిపించింది.
పోలీసుల దర్యాప్తులో, దీప్తి మృతదేహం పనసపాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం సమీపంలోని గాడేరు కాలువ గట్టుపై కనిపించింది. అశోక్ మృతదేహం హుస్సేన్‌పురం రైల్వే ట్రాక్ వద్ద పడి ఉంది. బాలిక చనిపోయిన చోట లభ్యమైన టోపీ ఆధారంగా, హత్యకు పాల్పడిన యువకుడే అశోక్ అని గుర్తించారు.
రైల్వే ట్రాక్ వద్ద లభ్యమైన ద్విచక్రవాహన నంబర్ ఆధారంగా ఇద్దరూ దుర్గాడ గ్రామానికి చెందినవారని తేలింది. పోలీసులు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్, కాల్ డేటా విశ్లేషణ ద్వారా దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు.


