సూపర్ 8లోకి జింబాబ్వే ..
ప్రపంచ విజేతలకే చుక్కలు చూపిస్తున్న పసికూన
అంచనాలకు అందకుండా సరికొత్త రికార్డులతో దూసుకుపోతున్న జట్టు
కాకతీయ, స్పోర్ట్స్ డెస్క్: క్రికెట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఒకప్పుడు పసికూనగా భావించిన జట్టు ఏకంగా ప్రపంచ విజేతలకే చుక్కలు చూపిస్తుంటే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. ప్రస్తుత టీ20 వరల్డ్ కప్‌లో సరిగ్గా ఇదే సీన్ రిపీట్ అవుతోంది. గ్రూప్ స్టేజ్ మ్యాచులు మొదలైనప్పుడు జింబాబ్వే జట్టు సూపర్ 8కి వెళ్తుందని ఎవరు కూడా అంచనా వేసి ఉండరు. కానీ ఎవరి అంచనాలకు అందకుండా ఆ జట్టు అత్యుత్తమ క్రికెట్ ఆడుతూ సూపర్ 8కు దూసుకెళ్లింది. ఈ టోర్నీలో జింబాబ్వే జట్టు చూపించిన కసి, పోరాట పటిమ చూస్తుంటే ఇప్పుడు పెద్ద జట్లకు కూడా వణుకు మొదలైంది. అంతా అయిపోయింది! అనుకున్న కథను మళ్లీ మొదటి నుంచి రాస్తూ, సరికొత్త రికార్డులతో దూసుకుపోతున్న ఆ జట్టు ప్రస్థానం ఇప్పుడు క్రీడా ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ విజయాల్లో జింబాబ్వే కీలక ఆటగాళ్ల పాత్ర ఎంతో ఉంది. బ్యాటింగ్‌లో బ్రయాన్ బెన్నెట్ నిలకడగా రానిస్తూ జట్టుకు వెన్నెముకలా నిలుస్తున్నాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచులో 63 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు. ఇక కెప్టెన్ సికందర్ రజా తన అనుభవంతో బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణిస్తూ లంకపై 45 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. బౌలింగ్ విభాగంలో బ్లెస్సింగ్ ముజర్బాని నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థులను వణికిస్తున్నాడు. శ్రీలంకపై కూడా ముజర్బాని 2 వికెట్లు తీసి తన సత్తా చాటారు. బ్రాడ్ ఎవాస్, రిచర్డ్ నగరావ వంటి బౌలర్లు కూడా పరిస్థితిని బట్టి వికెట్లు తీస్తూ ప్రత్యర్థి టీమ్స్ ని కట్టడి చేస్తున్నారు.


