8వ వార్డు అభివృద్ధే నా ప్రధాన లక్ష్యం
బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి గుగులోత్ శివకుమార్
గ్రామ దేవతాలయాల పూర్తి, బొడ్రాయి పండుగ నిర్వహణకు హామీ
కాకతీయ, గజ్వేల్ : గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు సమగ్ర అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి గుగులోత్ శివకుమార్ స్పష్టం చేశారు. వార్డులో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రథమ కర్తవ్యమన్నారు.
గ్రామ ఆధ్యాత్మిక సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ గ్రామ దేవతల ఆలయాల నిర్మాణాన్ని పూర్తి చేస్తానని, బొడ్రాయి పండుగను ఘనంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. కులదైవాల ఆలయాల అభివృద్ధికి కూడా పూర్తి స్థాయిలో సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. కాలనీలో నెలకొన్న డ్రైనేజీ, సీసీ రోడ్లు, మంచినీటి సరఫరా వంటి మౌలిక సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని దశలవారీగా పరిష్కరిస్తానన్నారు. ముఖ్యంగా ఈ వార్డులో స్మశానవాటిక లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి, ప్రత్యేక స్థలం కేటాయించి స్మశానవాటిక నిర్మాణంతో పాటు వైకుంఠ రథం ఏర్పాటు చేస్తానని వెల్లడించారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు ప్రభావిత కుటుంబాలు ఎదుర్కొంటున్న ఆర్‌అండ్‌ఆర్ సమస్యలు, ప్లాట్లు, ఇండ్ల రిజిస్ట్రేషన్ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారం సాధిస్తానని భరోసా ఇచ్చారు. మహిళలు, యువత, నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తానని పేర్కొంటూ, ప్రతి ఇంట్లో ఆడపిల్ల పుట్టినప్పుడు జన్మకానుకగా రూ.1,116 అందిస్తానని, మరణించిన కుటుంబాలకు రూ.2,500 ఆర్థిక సహాయం అందిస్తానని ప్రకటించారు. ప్రతి రెండు నెలలకు ఒకసారి ఉచిత వైద్య శిబిరాలు, నిరుద్యోగ యువతకు ప్రతినెలా జాబ్‌మేళా నిర్వహిస్తానని తెలిపారు. తనను ఆశీర్వదించి గెలిపిస్తే ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ 8వ వార్డును అభివృద్ధి పథంలో నడిపిస్తానని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ అమరేందర్, రాయవరం సర్పంచ్ రమేష్ గౌడ్, మాజీ సర్పంచులు కనకయ్య, గణేష్, సీనియర్ నాయకులు గౌటి సంపత్, రిప్పల స్వామి, కొమ్ము నరేష్ యాదవ్, నాగరాజు, బాబు, బిక్షపతి, అనిల్ తదితరులు పాల్గొన్నారు.


