సామినేనిని హత్య చేసిందెవరు..??
దర్యాప్తు ఎందుకు ముందుకు సాగడం లేదు..?
రక్తచరిత్రలో రాజకీయ కోణంపై అనుమానాలు
కాంగ్రెస్ నేతలపై భార్య స్వరాజ్యం ఫిర్యాదు
సీపీఎం పార్టీలోని ముఖ్య నేతపైనా అనుమానాలంట
కొత్తగా సరూర్‌నగర్‌లోని ఓ ల్యాండ్ వివాదం తెరపైకి
నేరస్థులను పట్టుకునేందుకు రెండు వారాలుగా 5టీంల వేట
అయినా దర్యాప్తులో ప్రగతి లేదా.. పోలీసుల గోప్యతపై వెల్లడవుతున్న అనేక అనుమానాలు
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : కమ్యూనిస్టు సీనియర్ నేత సామినేని రామారావు హత్య కేసు మిస్టరీగా మారింది. హత్య జరిగి రెండు వారాలవుతున్నా.. ఖమ్మం పోలీసులు మాత్రం నిందితులు పట్టుకోలేక పోయారు. ఈ హత్యలో రాజకీయ కోణం ఉందని, రాజకీయ కక్ష్యలే హత్యకు దారితీశాయని ఆరోపణలు,విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో జాప్యం జరుగుతుండటంపై అనుమానాలు నెలకొంటున్నాయి. రెండు వారాలు పూర్తయినా ఇప్పటి వరకు ఎలాంటి పురోగతిని పోలీసులు వెల్లడించకపోవడం గమనార్హం. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడులో సీపీఎం పార్టీ సీనియర్ నాయకులు సామినేని రామారావు గత నెల 31న సొంత ఇంట్లోనే అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. వాకింగ్ వెళ్లోస్తుండగా..ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు వేటకొడవళ్లతో నరికి చంపారు. ఈ ముగ్గురు కూడా గ్రామానికి చెందిన వారు కాదని పోలీసుల ప్రాథమిక విచారణలో గుర్తించారు. హత్యకు ముందు రెక్కి కూడా నిర్వహించినట్లుగా కూడా తెలుస్తోంది. ఈనేపథ్యంలో ఈ హత్యకు సుపారీ ఇచ్చి ఎవరో చేయించారనే వాదన బలంగా వినిపిస్తోంది.
రాజకీయ హత్యేనా..?
సీపీఎం సీనియర్ నేత సామినేని రామారావు హత్య జిల్లాలో ప్రకంపనలు సృష్టించింది. సీపీఎం పార్టీలో మంచి గుర్తింపు ఆయన్ను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది..? అందునా సుపారీ ఇచ్చి మరీ ఆయన అంత మొందించాలనే లక్ష్యంతో చేసిన ఈ ఘాతుకానికి పెద్ద ఎత్తున వ్యూహ రచన జరిగినట్లుగా స్పష్టమవుతోంది. గ్రామంలో నెలకొన్న రాజకీయ అంశాలు..హత్యలు చేసుకునేంత స్థాయిలో లేవని పార్టీ వర్గాల నుంచి అభిప్రాయం వ్యక్తమవుతుండటం గమనార్హం. సరూర్‌నగర్‌లోని ఓ ల్యాండ్ వివాదం నేపథ్యంలోనే సామినేని హత్య జరిగినట్లుగా ఒక ప్రచారం జరుగుతోంది. అలాగే సొంత పార్టీలో కూడా సామినేని ప్రభావాన్ని జీర్ణించుకోలేని ఓ ముఖ్య నేతకు ఈ హత్యకు లింకులు ఉన్నట్లుగా గుసగుసలు వినబడుతుండటం గమనార్హం. సామినేని పార్టీలో కొరకరాని కొయ్యలా తయారవడం, ఆయన ఎదుగుదలను ఒర్వలేకనే ఓ ముఖ్య నేత కొద్దికాలంగా ఆగ్రహంతో ఉన్నట్లుగా కూడా చర్చ జరుగుతోంది. ఈనేపథ్యంలోనే సామినేని హత్యకు గురికావడంతో పోలీసులు ఆ ముఖ్య నేతకు సామినేనితో ఉన్న సంబంధాలను రహస్యంగా ఆరా తీస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా తన భర్త హత్యలో గ్రామానికి చెందిన ఐదుగురు కాంగ్రెస్ నాయకుల ప్రమేయం ఉందని అనుమానిస్తూ మృతుడి భార్య స్వరాజ్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. హత్య కేసును ఛేదించేందుకు పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. క్లూస్ టీం, స్నిఫర్ డాగ్స్, సైబర్ టీం వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేసినట్లు అధికారిక సమాచారం లేదు. సామినేని రామారావు హత్య కేసు దర్యాప్తులో జాప్యంపై సీపీఎం, మృతుడి కుటుంబ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దర్యాప్తును వేగవంతం చేసి నిందితులను వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
దర్యాప్తులో జాప్యం.. పార్టీ నేతల ఆందోళన..!
సామినేని రామారావు హత్య కేసు దర్యాప్తులో జాప్యం జరుగుతోందని సీపీఎం నాయకులు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. హత్య జరిగి రెండు వారాలు దాటినా నిందితులను పోలీసులు ఇంకా అరెస్టు చేయకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హంతకులను పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని, ఇది దద్దమ్మ సర్కార్ అంటూ సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు మండిపడ్డారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలోనే ఈ హత్య జరగడంతో, దర్యాప్తులో రాజకీయ పక్షపాతం మరియు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని సీపీఎం ఆరోపించింది. ఇదిలా ఉండగా..! ఈ హత్య జరగడం వెనుక అధికార పార్టీ నాయకులు ఉన్నట్లు ఆరోపిస్తూ ఇటీవల సీపీఎం రాష్ట్ర, జిల్లా పార్టీ నాయకులు డీజీపీ శివధర్‌రెడ్డికి స్వయంగా కలిసి వినతి అందజేశారు. అయితే గతంలో తెల్దారుపల్లి గ్రామంలో తమ్మినేని కృష్ణయ్య హత్య కూడా పాత కక్ష్యలతోనే జరిగినట్లుగా ఇది జరిగి ఉంటుందా అన్న కోణంలో ఖమ్మం పోలీసులు అనుమానిస్తున్నట్లుగా విశ్వసనీయంగా తెలుస్తోంది.


