గిరిజన వసతి గృహంలో హింసాత్మక ఘటన
ఇంటర్ విద్యార్థుల దాడి.. 9వ తరగతి విద్యార్థి అపస్మారక స్థితిలోకి
కాకతీయ, నర్సంపేట: వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని గిరిజన బాలుర వసతి గృహ పాఠశాల విద్యార్థిపై ఇంటర్ విద్యార్థిపై దాడి చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు 9వ తరగతి విద్యార్థులపై దాడికి దిగడంతో 9వ తరగతి విద్యార్థి దీపక్ తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరాడు. తోటి విద్యార్థులు అతడిని హుటాహుటిన నర్సంపేట ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
దాడిలో మరో ఇద్దరు 9వ తరగతి విద్యార్థులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థుల మధ్య వాగ్వాదం ఒక్కసారిగా హింసాత్మకంగా మారడంతో వసతి గృహంలో భయాందోళన నెలకొంది. అయితే ఘటన జరిగిన సమయంలో వార్డెన్, అధ్యాపకులు అందుబాటులో లేకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. వసతి గృహాల్లో విద్యార్థుల భద్రతపై పర్యవేక్షణ లోపిస్తున్నదని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఘర్షణకు గల అసలు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. చిన్న విషయమే పెద్ద వివాదంగా మారిందా? లేక పాత విరోధాలే కారణమా? అన్న దానిపై అధికారులు విచారణ ప్రారంభించారు. గిరిజన విద్యార్థుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన వసతి గృహాల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.


