మద్రాస్ హైకోర్టులో విజయ్‌కు షాక్
రూ.1.50 కోట్ల పెనాల్టీ చెల్లించాల్సిందేనన్న న్యాయస్థానం
భారీ జరిమానాను సవాలు చేస్తూ దళపతి రిట్ పిటిషన్
జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పిన ధర్మాసనం
కాకతీయ, నేషనల్ డెస్క్: ప్రముఖ సినీ నటుడు, ‘తమిళగ వెట్రి కజగం’ పార్టీ అధినేత దళపతి విజయ్‌కు మద్రాస్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆదాయపు పన్నుశాఖ తనకు విధించిన రూ.1.50 కోట్ల భారీ జరిమానాను సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను న్యాయస్థానం శుక్రవారం కొట్టివేసింది. ఐటీశాఖ జారీచేసిన పెనాల్టీ ఉత్తర్వులు చట్టబద్ధంగానే ఉన్నాయని, నిర్ణీత గడువులోపే ఆ నోటీసులు జారీ అయ్యాయని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. దీంతో విజయ్ ఇప్పుడు ఆ జరిమానా చెల్లించడం లేదా పై కోర్టులకు వెళ్లడం అనివార్యమైంది.
అసలేం జరిగింది?
ఈ కేసు మూలాలు 2015 నాటివి. 2015 సెప్టెంబర్‌లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు విజయ్ నివాసంలో ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో విజయ్ నటించిన ‘పులి’ సినిమాకు సంబంధించి కొన్ని కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సినిమా ద్వారా విజయ్ సుమారు రూ.15 కోట్ల అదనపు ఆదాయాన్ని పొందారని, కానీ ఆ మొత్తాన్ని తన ఆదాయపు పన్ను రిటర్నుల్లో చూపించలేదని ఐటీ శాఖ ఆరోపించింది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి గానూ ఈ ఆదాయాన్ని దాచిపెట్టారన్నది ప్రధాన అభియోగం.
రూ.1.50 కోట్ల పెనాల్టీ
సోదాల్లో లభించిన ఆధారాల మేరకు ఐటీ శాఖ చర్యలకు ఉపక్రమించింది. లెక్కల్లో చూపని ఆ రూ.15 కోట్ల ఆదాయానికి సంబంధించి, 2022 జూన్ 30న ఒక ఉత్తర్వు జారీ చేసింది. దీని ప్రకారం విజయ్ రూ.1.50 కోట్ల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ విజయ్ 2022లోనే మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి బెంచ్, 2022 ఆగస్టు 16న పెనాల్టీ చెల్లింపుపై మధ్యంతర స్టే విధించింది.
వాదనలు ఏంటి?
విజయ్, ఐటీ శాఖ తరఫున హోరాహోరీ వాదనలు జరిగాయి. “ఐటీ శాఖ జారీ చేసిన పెనాల్టీ ఆర్డర్ కాలం చెల్లింది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 275 ప్రకారం, 2019 జూన్ 30 లోపే ఈ ఉత్తర్వులు ఇవ్వాలి. కానీ మూడేళ్లు ఆలస్యంగా ఇచ్చారు కాబట్టి దీన్ని రద్దు చేయాలి” అని విజయ్ తరఫున వాదనలు వినిపించారు. చట్టంలోని సెక్షన్ 263 ప్రకారం, షోకాజ్ నోటీసు జారీ చేయడం, పెనాల్టీ విధించడం అన్నీ నిబంధనల ప్రకారమే, నిర్ణీత గడువులోపే జరిగాయి. ఇందులో ఎలాంటి ఉల్లంఘన లేదు” అని ఐటీ శాఖ వాదనలు వినిపించింది.


