సమాజ నిర్మాణం తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుంది…
పిల్లలను స్వేచ్ఛగా వివక్షతరహితంగా పెంచాలి…
స్మార్ట్ కిడ్జ్ చిల్డ్రన్స్ డే” వేడుకలలో జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి శ్రీరామ్…..
కాకతీయ,ఖమ్మం : సమాజ నిర్మాణం తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుందని స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో శుక్రవారం జరిగిన బాలల దినోత్సవ వేడుకలలో జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి శ్రీరామ్ తెలియజేశారు. పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య పర్యవేక్షణలో జరిగిన చిల్డ్రన్స్ డే వేడుకలలో తొలుత భారత దేశ ప్రథమ ప్రధానమంత్రి చాచా నెహ్రూ జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి శ్రీరామ్ మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను స్వేచ్ఛగా వివక్షత రహితంగా పెంచాలని కోరారు. పిల్లలను సమాజ రుగ్మతల పట్ల నిత్యం అవగాహన కల్పించి చైతన్యం పెంచాలని తెలియజేశారు. స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో చిన్నారులకు పలు రకాల పోటీలను నిర్వహించి ప్రోత్సహించడం అభినందనీయం అన్నారు. తాను చిన్నప్పుడు స్టేజ్ పైకి వెళ్లిన సందర్భాలు లేవని కానీ ఈ పాఠశాలలో చిన్నారులు అవలీలగా స్టేజిపై అనర్గళంగా మాట్లాడడం, పలు పోటీలలో పాల్గొనడం, లఘు నాటికలలో తమ ప్రావీణ్యాన్ని చూపించడం అద్భుతం అని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు గుడ్ టచ్ బాడ్ టచ్ లపై అవగాహన కల్పించి ప్రవర్తించే విధానాన్ని నేర్పాలని కోరారు. పాఠశాల కరెస్పాండెంట్ చింత నిప్పు కృష్ణ చైతన్య మాట్లాడుతూ తమ పాఠశాలలో విద్యార్థులను అన్ని రంగాలలో స్వతంత్రంగా నేర్చుకునే విధంగా ప్రోత్సహిస్తున్నామన్నారు. చిల్డ్రన్స్ డే తో పాటు జాతీయ పర్వ దినాల నిర్వహణ, పిక్నిక్లు, ఇన్స్పైర్ సైన్స్ ఎక్స్పోలు నిర్వహణ వివిధ పోటీలలో ప్రోత్సహించడం, తదితర అన్ని కార్యక్రమాలలో విద్యార్థులు అందరిని వెన్నంటి ప్రోత్సహిస్తున్నామని అందుకే తల్లిదండ్రుల విద్యార్థులు తమ పాఠశాలకు సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులు స్టేజిపై లఘు నాటికలను నటనా నైపుణ్యంతో ప్రదర్శించి అబ్బురపరిచారు. 150 మంది విద్యార్థులు సమాజంలోని పలు అంశాలను ప్రస్తావిస్తూ ఫాన్సీ డ్రెస్ పోటీలో పాల్గొన్నారు.పలు రకాలు నృత్యాలు పాఠశాల ప్రాంగణాన్ని హోరెత్తించాయి. పోటీల అనంతరం గెలుపొందిన విజేతలకు జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి శ్రీరామ్, పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్యలు బహుమతులు ప్రధానం చేశారు. బాలల దినోత్సవ వేడుకలతో పాఠశాల ప్రాంగణం అంతా ఆనంద ఉత్సవాలతో, కోలాహాలంగా మారింది. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య, ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు తదితరులు పాల్గొన్నారు.



