వచ్చేది మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే
మునిసిపాలిటీలో విలీనం చేసిన గ్రామాలను విడదీయడానికి సిద్ధం
ఎదులాపురంలో కందాళ ఉపేందర్ రెడ్డి హామీ
కాకతీయ, కూసుమంచి : రాష్ట్రంలో రాబోయేది మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ప్రజలు కోరుకుంటే మున్సిపాలిటీలో కలిపిన గ్రామాలను తిరిగి పంచాయతీలుగా మార్చేందుకు ప్రయత్నిస్తామని మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 10, 11, 12వ వార్డుల్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన విస్తృతంగా పర్యటించారు. సీపీఎం మద్దతుతో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు పెరుమాళ్లపల్లి మరియమ్మ, పేరం రమాదేవి, మొర్రిమేకల సత్యనారాయణకు కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో పలు గ్రామాలను కార్పొరేషన్లో కలిపినప్పుడు తానే పోరాడి కేసీఆర్ నాయకత్వంలో తిరిగి గ్రామాలుగా విడదీయించానని గుర్తుచేశారు. ప్రజలు కోరితే మళ్లీ అధికారంలోకి వచ్చాక ఇదే విధంగా చర్యలు తీసుకునే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. గ్రామాలను మున్సిపాలిటీలో కలపడం వల్ల పేద ప్రజలపై పన్నుల భారం అధికంగా పడుతోందని, ఇది సామాన్యులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోందన్నారు. అందుకే గ్రామాల స్వతంత్ర హోదాను కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ ప్రచారంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాత మధుసూదన్, సీపీఎం పాలేరు డివిజన్ కార్యదర్శి బండి రమేష్ తదితరులు పాల్గొన్నారు.


