లంకపల్లి పంచాయతీ ‘రాజా’దే!
రాష్ట్ర నేతల హోరాహోరీ ప్రచారం
ఐనా చివరికి మాచినేని వైపే నిలిచిన జనం
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మాచినేని రాజా చంద్రశేఖర్ ఘన విజయం సాధించారు. ఈ పంచాయతీ ఎన్నిక సాధారణ గ్రామస్థాయి పోటీగా కాకుండా, ఇద్దరు రాష్ట్ర స్థాయి నేతల మధ్య ప్రతిష్ఠాత్మక సమరంగా మారడంతో జిల్లా రాజకీయ వర్గాల దృష్టిని ఆకర్షించింది. ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ విజయబాబు సమీప బంధువు సిరిపురి రాధిక ఒకవైపు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు నున్నా రామకృష్ణ మేనల్లుడు మాచినేని రాజా చంద్రశేఖర్ మరోవైపు బరిలో నిలవడంతో లంకపల్లి రాజకీయంగా వేడెక్కింది. ‘నువ్వా నేనా’ అన్నట్టుగా సాగిన ప్రచారం చివరి నిమిషం వరకు ఉత్కంఠను రేపింది.
మంత్రులు, నేతల చూపంతా లంకపల్లిపైనే
ఎన్నికల ప్రచారం రోజుల్లో లంకపల్లి గ్రామం రోజూ పండుగ వాతావరణాన్ని తలపించింది. ఇరు వర్గాల నేతలు తమ బలాన్ని ప్రదర్శించడంతో పాటు, బంధువుల గెలుపు కోసం శక్తి సామర్థ్యాలు పూర్తిగా వినియోగించారు. ఈ పోరు రాష్ట్ర మంత్రులు, జిల్లా నేతల దృష్టినీ ఆకర్షించింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో చివరకు మాచినేని రాజా చంద్రశేఖర్ విజయం సాధించి సర్పంచ్ పదవిని కైవసం చేసుకున్నారు. విజయం అనంతరం ఆయన మాట్లాడుతూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాఘమయి–దయానంద్ దంపతులు, తన మేనమామ నున్నా రామకృష్ణ ఆశీస్సులతోనే ఈ విజయం సాధ్యమైందని తెలిపారు.
గ్రామానికి ఐదేళ్ల సేవల హామీ
తనకు అవకాశం కల్పించిన లంకపల్లి గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలుపుతూ, రానున్న ఐదేళ్లపాటు మడమ తిప్పని సేవలతో గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని నూతన సర్పంచ్ రాజా చంద్రశేఖర్ హామీ ఇచ్చారు. లంకపల్లి పంచాయతీ ఫలితం జిల్లాలో రాజకీయంగా మరో చర్చకు తెరలేపింది.


