సంకెళ్లు పడాల్సిందే
కుమ్మెర మల్లన్న జాతరలో కులవివక్ష దాడి హేయం
సర్పంచ్, అగ్రనాయకులపై కేసులు నమోదు చేయాలి
డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి
కాకతీయ, గజ్వేల్: నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో కుమ్మెర మల్లన్న స్వామి జాతర సందర్భంగా కులవివక్ష చూపుతూ ఆలయానికి వెళ్లిన వారిపై దాడి చేసి రెండు నెలల చిన్నారిని కాలితో తొక్కి హత్య చేసిన సర్పంచ్, అగ్రనాయకులపై వెంటనే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి డిమాండ్ చేశారు. సోమవారం గజ్వేల్ పట్టణంలో జిల్లా కార్యదర్శి బ్యాగరి వేణులు, జిల్లా నాయకులు కొల్గూరి మైసయ్యతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మల్లన్న జాతర సందర్భంగా వెనుకబడిన వర్గానికి చెందిన చాకలి చంద్రకళ కుటుంబం దర్శనం కోసం ఆలయానికి వెళ్లగా ప్రవేశ ద్వారం వద్ద అడ్డుకున్నారని తెలిపారు. కుల దూషణలు చేస్తూ దాడి జరిపినట్లు ఆరోపించారు. ఆ ఘర్షణలో రెండు నెలల పసికందును కాలితో తొక్కిన ఘటన అత్యంత అమానుషమని అన్నారు. తీవ్ర గాయాలతో ఉన్న శిశువు అనంతరం ప్రాణాలు కోల్పోవడం సమాజాన్ని కలచివేసే విషయమన్నారు. కులవివక్ష ఆధారంగా ఆలయ ప్రవేశాన్ని నిరాకరించడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేశారు. ఈ ఘటనను ప్రతి ఒక్కరూ ఖండించాలని, బాధ్యులపై హత్య కేసుతో పాటు కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. నిందితులను తక్షణమే అరెస్ట్ చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.


