45 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు…
కీలక శాఖలు, జిల్లాల్లో మార్పులు
కాకతీయ, తెలంగాణ బ్యూరో :
కాకతీయ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐఏఎస్ అధికారుల బదిలీలు చేపట్టి మొత్తం 45 మందిని మార్చింది. ఐటీ, పరిశ్రమల శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న సంజయ్ కుమార్‌ను పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేశారు.
జీవో ఆర్టి నెం. 290 ప్రకారం మొత్తం 45 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం పరిశ్రమలు, ఐటి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న సంజయ్ కుమార్‌ను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ అండ్ ఆర్ఎస్ఏడీ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేశారు. ఆ స్థానంలో ఎన్. శ్రీధర్‌ను ఐటి, పరిశ్రమల శాఖల ప్రధాన కార్యదర్శిగా నియమించడంతో పాటు గనులు, భూగర్భ శాఖ పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.
రాహుల్ బొజ్జాను ఐ అండ్ సి ఏ డి శాఖ నుంచి సాధారణ పరిపాలన శాఖ రాజకీయ విభాగ ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేసి, బీసీ సంక్షేమ శాఖ అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఈ. శ్రీధర్‌ను సాగునీటి మరియు కమాండ్ ఏరియా అభివృద్ధి శాఖ కార్యదర్శిగా నియమించారు. డాక్టర్ గౌరవ్ ఉప్పల్‌ను తెలంగాణ భవన్ సమన్వయ విభాగం నుంచి ఆర్థిక మరియు ప్రణాళిక శాఖ కార్యదర్శిగా బదిలీ చేశారు.
మహబూబ్‌నగర్ కలెక్టర్ బి. విజయేంద్రను సామాజిక సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థల సమాఖ్య కార్యదర్శిగా, షెడ్యూల్డ్ కాస్ట్ అభివృద్ధి కమిషనర్‌గా నియమించారు. కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతిను కార్మిక శాఖ ప్రత్యేక కమిషనర్‌గా బదిలీ చేయగా, ఆమె స్థానంలో చిత్ర మిశ్రాను కరీంనగర్ కలెక్టర్‌గా నియమించారు.
భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేష్ వి. పాటిల్‌ను తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బదిలీ చేసి, నిజామాబాద్ అదనపు కలెక్టర్ అంకిత్‌ను భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌గా నియమించారు. మహబూబ్‌నగర్ కలెక్టర్‌గా ఖుష్బూ గుప్తా, వికారాబాద్ కలెక్టర్‌గా దీపక్ తివారీ, మెదక్ కలెక్టర్‌గా ప్రతిమా సింగ్, రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌గా గరీమా అగ్రవాల్ నియమితులయ్యారు.
జంగావ్, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్, నారాయణపేట, హనుమకొండ, జోగులాంబ గద్వాల జిల్లాలకు కూడా కొత్త కలెక్టర్లను నియమించారు. జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ పదవుల్లో కూడా మార్పులు చేసి కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్ జోన్లకు కొత్త అధికారులను నియమించారు.
ఇలా పరిపాలన అవసరాల దృష్ట్యా శాఖల మార్పులు, జిల్లాల కలెక్టర్ల బదిలీలు, అదనపు బాధ్యతల కేటాయింపులతో ప్రభుత్వం విస్తృత స్థాయిలో పరిపాలన పునర్వ్యవస్థీకరణ చేపట్టింది.


