కాకతీయ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ముఖ్య వ్యాఖ్యలు చేశారు. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్‌గా నిలిచిందని గర్వంగా ప్రకటించారు. వ్యవసాయం, పారిశ్రామిక రంగం, సేవా రంగం అన్ని విభాగాల్లోనూ స్థిరమైన వృద్ధి సాధించడం వల్లే ఈ రికార్డు సాధ్యమైందని వివరించారు. కర్ణాటక, హర్యానా వంటి అభివృద్ధి చెందిన రాష్ట్రాలను కూడా అధిగమించడం తెలంగాణ సాధించిన గర్వకారణమని అన్నారు.
వార్షిక రుణ ప్రణాళికలో మొదటి క్వార్టర్‌లోనే 33.64 శాతం సాధించడం అభినందనీయమైన అంశం అని బ్యాంకర్లను అభినందించారు. ఇందిరమ్మ ఇళ్లకు, స్వయం ఉపాధి పథకాలకు, వ్యవసాయ అనుబంధ రంగాలకు విస్తృతంగా రుణాలు ఇవ్వడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ఆయన తెలిపారు.
వ్యవసాయ రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా భావిస్తుందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రైతుల కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రస్తావిస్తూ, రైతు రుణమాఫీ, రైతు భరోసా పేరిట ఇప్పటివరకు 30 వేల కోట్ల రూపాయలను బ్యాంకులకు ప్రభుత్వం జమ చేసిందని తెలిపారు. ఇది బ్యాంకింగ్ రికవరీ చరిత్రలోనే ఒక రికార్డు అన్నారు.
రైతులకు సకాలంలో రుణాలు అందించడం అత్యవసరమని, వారికి అనవసరమైన ఆస్తుల తాకట్టు, ఫిక్స్డ్ డిపాజిట్ల భారం మోపవద్దని స్పష్టం చేశారు. బ్యాంకర్లు రైతులను మానవీయ కోణంలో చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రైతు అనేది కేవలం ఒక కస్టమర్ మాత్రమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు పునాది వంటి వారని గుర్తు చేశారు.
బ్యాంకర్లు సామాజిక బాధ్యతతో ముందుకు వస్తే రైతులు మరింత బలపడతారని, తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ఇంకా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లగలమని తెలిపారు. రైతులకు మద్దతుగా బ్యాంకింగ్ రంగం చురుకైన సహకారం అందిస్తే రాష్ట్ర అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.


