పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి
31 మంది మృతి.. 170 మందికి గాయాలు
క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమం
ఇస్లామాబాద్ షెహజాద్ ప్రాంతంలో ఘటన
తీవ్రంగా స్పందించిన పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, ప్రధాని షరీఫ్
పౌరుల ప్రాణాలు తీయడం హేమమని ప్రకటన
కాకతీయ, నేషనల్ డెస్క్: పాకిస్థాన్ ఇస్లామాబాద్‌లోని షెహజాద్ ప్రాంతంలో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. షియా మసీదు లోపల జరిగిన పేలుడులో దాదాపు 31 మంది మరణించగా, 170 మంది గాయపడినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. మరోవైపు, దాడికి పాల్పడ్డ వ్యక్తి విదేశీయుడని, అతడికి తెహ్రీక్-ఎ-తాలిబాన్‌తో సంబంధాలున్నాయని పోలీసువర్గాలు తెలిపాయి. మొదట నిందితుడు ఇమామ్‌బర్గా గేటు వద్దకు రాగానే పోలీసులు అడ్డుకున్నారని, అయినప్పటికీ అతడు తనను తాను పేల్చుకున్నాడని చెప్పారు. అయితే, ఈ దాడికి బాధ్యులెవరనే విషయంపై ఇప్పటివరకు ఏ గ్రూపు ప్రకటించలేదు.
గత నవంబర్ నెలలోనూ..
మరోవైపు, పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, ప్రధాని షెహబాజ్ షరీఫ్, సెనేట్ ప్రతిపక్ష నాయకుడు అల్లామా రాజా నాసిర్ అబ్బాస్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ప్రార్థనా మందిరాలను లక్ష్యంగా చేసుకుని పౌరుల ప్రాణాలు తీయడం హేమమని అబ్బాస్ పేర్కొన్నారు. ఇటువంటి దాడులను తాము సంహిచబోమని తెలిపారు. అయితే, గడిచిన ఆరు నెలల్లో రాజధాని నగరంలో జరిగిన పేలుళ్లలో ఇది రెండోదిగా తెలుస్తోంది. గత నవంబర్‌లో ఇస్లామాబాద్ కోర్టు సముదాయంలో జరిగిన కారు పేలుడులో దాదాపు 12 మంది మరణించగా, 25 మందికి పైగా గాయపడ్డారు.


