- కలెక్టర్ జితేష్ పాటిల్
కాకతీయ, కొత్తగూడెం రూరల్: ధాన్యం కొనుగోలుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ తెలపారు. మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్, అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ లతో కలిసి క్యాంపు కార్యాలయం నుండి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వానాకాలం ధాన్యం కొనుగోళ్లను పూర్తిస్థాయిలో విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటున్నామని తెలిపారు. జిల్లాలో మొత్తం 193 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, సుమారు 2,38,177 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరగవచ్చని అంచనా వేశామని వివరించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వేగంగా తరలించేందుకు రవాణా వసతులు, నిల్వ గోదాంలు, మిల్లర్లతో సమన్వయం చర్యలు చేపట్టామన్నారు. ధాన్యం విక్రయించిన రైతులకు 48 గంటల్లోపే చెల్లింపులు జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, పౌరసరఫరాల అధికారి రుక్మిణి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


