మార్చి 2న శ్రీవారి కళ్యాణోత్సవం
ఆహ్వాన పత్రిక ఆవిష్కరించిన ప్రజాప్రతినిధులు
దాతలు, భక్తులకు దేవదాయ శాఖ పిలుపు
కాకతీయ, కారేపల్లి: సింగరేణి మండల పరిధిలోని కారేపల్లి గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో మార్చి 2న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా దేవదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో ఆహ్వాన బ్రోచర్‌ను గురువారం ఘనంగా ఆవిష్కరించారు.
కార్యక్రమంలో సర్పంచ్ మేదరి వీర ప్రతాప్ (టోనీ), దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఆర్. సమత, ఈఓ వేణుగోపాలచార్యులు పాల్గొన్నారు. హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాది ఈ ఉత్సవాన్ని దాతల సహకారంతో వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
లోకక్షేమార్థం నిర్వహించే ఈ పవిత్ర కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కృప పొందాలని కోరారు. ఉత్సవాల విజయవంతానికి దాతలు ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.


