- ఇంటి నిర్మాణానికి 1000 చ.గ. స్థలం
- గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయం
- మర్యాద పూర్వకంగా క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసిన శ్రీచరణి
- మహిళా క్రికెటర్ కు పుష్ప గుచ్చం ఇచ్చి స్వాగతం పలికిన మంత్రి నారా లోకేశ్
కాకతీయ, ఏపీ బ్యూరో: మహిళా క్రికెట్ వరల్డ్ కప్ విజేత, టీమిండియా సభ్యురాలైన తెలుగమ్మాయి శ్రీ చరణికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారీ నజరానా ప్రకటించారు. శ్రీ చరణికి రూ.2.5 కోట్ల నగదు బహుమతి ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. దీంతో పాటు ఇల్లు నిర్మించుకునేందుకు కడపలో 1000 చ.గ. స్థలం కేటాయిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం లో గ్రూప్ 1 అధికారిగా ఉద్యోగం కూడా కల్పిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. శుక్రవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును, మంత్రి నారా లోకేష్‌ను క్రికెటర్ శ్రీ చరణి మర్యాద పూర్వకంగా కలిశారు. ఉమెన్ వరల్డ్ కప్ గెలుచుకున్న ఆనందక్షణాలను సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌తో శ్రీ చరణి పంచుకున్నారు.
తనకు మద్దతుగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ శ్రీ చరణిని అభినందించారు. ఉమెన్ వరల్డ్ కప్ గెలుచుకోవడం ద్వారా భారత దేశ మహిళల సత్తా చాటారని, మహిళా క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారని సీఎం అన్నారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు భారత జట్టుకు అందించాలని అభిలషించారు. ఈ సందర్భంగా శ్రీ చరణి మహిళా క్రికెటర్లు సంతకాలు చేసిన టీ షర్ట్ ను ముఖ్యమంత్రికి అందించారు. దానిని ఆప్యాయంగా స్వీకరించిన ముఖ్యమంత్రి శ్రీచరణి బృందం భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
శ్రీ చరణితో పాటు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా ఉన్నారు. అంతకుముందు గన్నవరం ఎయిర్ పోర్టులో శ్రీ చరణికి ఘన స్వాగతం పలికిన మంత్రులు అనిత, సవిత, సంధ్యారాణి, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కేశినేని చిన్ని, కార్యదర్శి సానా సతీష్, శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు, ఆమెతో పాటు సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. క్యాంపు కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ శ్రీ చరణికి స్వాగతం పలికారు.


