పాల్వంచలో సంచలనం
పరీక్షా కేంద్రం టాయ్‌లెట్‌లో మృత శిశువుకు జననం
ఇంగ్లిష్ పరీక్ష రాయడానికి వచ్చిన పదహారేళ్ల బాలిక
అనుమానంతో బయటపడిన ఘటన
పరువు భయంతో శిశువును బేసిన్‌లో ఉంచినట్లు బాలిక వాంగ్మూలం
కాకతీయ, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న పదహారు ఏళ్ల మైనర్ బాలిక పరీక్షా కేంద్రంలోని టాయ్‌లెట్‌లో మృత శిశువుకు జన్మనిచ్చింది. పాల్వంచలోని ఓ పరీక్షా కేంద్రానికి ఇంగ్లిష్ పరీక్ష రాయడానికి వచ్చిన బాలిక, పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటి తర్వాత ఇన్విజిలేటర్ అనుమతితో టాయ్‌లెట్‌కు వెళ్లింది. అయితే ఎక్కువ సమయం అయినా ఆమె బయటకు రాకపోవడంతో ఇన్విజిలేటర్ అనుమానం వ్యక్తం చేసి టాయ్‌లెట్ వైపు వెళ్లారు. అక్కడ బాలిక నెమ్మదిగా బయటికి వస్తుండటంతో వివరాలు ఆరా తీశారు. అనంతరం సిబ్బంది లోపలికి వెళ్లి చూడగా బాత్రూం బేసిన్‌లో మృత శిశువు కనిపించింది. దీంతో కేంద్రంలో కలకలం రేగింది. ప్రాథమిక విచారణలో పరువు పోతుందనే భయంతో ఎవరికీ తెలియకుండా శిశువును బేసిన్‌లో ఉంచినట్లు బాలిక తెలిపినట్లు సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలికను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై బాలల సంరక్షణ, మహిళా సంక్షేమ శాఖలు కూడా విచారణ చేపట్టనున్నట్లు తెలిసింది.


