సమ్మక్క–సారలమ్మా… నా కొడుకు నుంచి కాపాడండి!
కాకతీయ, హన్మకొండ : మేడారం మహాజాతరకు వచ్చిన భక్తులు సమ్మక్క–సారలమ్మలకు సమర్పించిన కానుకలు, హుండీల్లో వేసిన వినతిపత్రాలు ఆసక్తికరంగా మారాయి. వనదేవతలను భక్తులు ఎంత నమ్మకంగా ఆశ్రయిస్తారో తెలియజేసేలా ఈసారి కూడా ఎన్నో విచిత్రమైన కోరికలు వెలుగులోకి వచ్చాయి. హుండీల్లో లభించిన కానుకల్లో ఓ భక్తురాలు వంద రూపాయల నోటుపై “సమ్మక్క–సారలమ్మా, నా కొడుకు భారి నుంచి నన్ను కాపాడండి” అంటూ రాసి వేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కుటుంబ సమస్యలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ఆ తల్లి వనదేవతల శరణు కోరిన తీరు అక్కడి అధికారుల దృష్టిని ఆకర్షించింది. ఇదిలా ఉండగా, మరికొందరు భక్తులు తెల్ల కాగితాలపై తమ కోరికలను రాసి హుండీల్లో సమర్పించారు. “నాకు త్వరగా పెళ్లి కావాలి”, “సంతానం ప్రసాదించండి”, “కుటుంబానికి ఆరోగ్యం ఇవ్వండి”, “ఆర్థిక కష్టాలు తొలగించండి” అంటూ ఎన్నో వినతులు హుండీల్లో దర్శనమిచ్చాయి. ప్రతి మేడారం జాతరలోనూ ఇలాంటి వినూత్న కోరికలు బయటపడుతుంటాయని ఆలయ సిబ్బంది చెబుతున్నారు. భక్తుల నమ్మకాలకు అద్దం పట్టే ఈ ఘటనలు వనదేవతలపై ప్రజలకు ఉన్న అపారమైన విశ్వాసాన్ని మరోసారి రుజువు చేస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. భక్తులు సమర్పించిన ఈ వినతులు మేడారం జాతర ప్రత్యేకతను, ప్రజల మనోభావాలను స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయి


