రూ. 40 కోట్లు అంచనా!
మేడారం హుండీల లెక్కింపు ప్రారంభం
ఈసారి జాతరలో 788 హుండీలు
హనుమకొండ టీటీడీ కల్యాణ మండపంలో ఏర్పాట్లు
లెక్కింపును ప్రారంభించిన దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ
కాకతీయ, తెలంగాణ బ్యూరో: మేడారం మహాజాతర హుండీ లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ఈ లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు. దీని కోసం దాదాపు పది రోజుల సమయం పట్టనుందని అధికారులు చెబుతున్నారు. ఈసారి మేడారంలో 788 హుండీలను అధికారులు ఏర్పాటు చేయగా పెద్ద ఎత్తున భక్తులు మేడారం జాతరకు తరలివచ్చి తమ కానుకలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మేడారం మహాజాతర అమ్మవార్లు వనప్రవేశం చేయడంతో పరిసమాప్తమైన నేపథ్యంలో హుండీల లెక్కింపు ప్రక్రియ ఈరోజు మొదలవడంతో హనుమకొండ నగరంలోని టీటీడీ కల్యాణ మండపం వద్ద పోలీసులు పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లను చేశారు. మంత్రి కొండా సురేఖ కొబ్బరికాయ కొట్టి లెక్కింపును లాంఛనంగా ప్రారంభించగా ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
లెక్కింపు ప్రక్రియలో 500ల మంది సభ్యులు
సమ్మక్క సారలమ్మ గద్దెల చెంత 588, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల చెంత 152 చొప్పున ఇంకా వడి బియ్యం కోసం 3, తిరుగువారం కోసం 40 మొత్తం 788 హుండీలను ఏర్పాటు చేశారు. దేవాదాయ శాఖ సిబ్బంది, సేవా సమితి నుంచి 500 మంది సభ్యులు ఈ లెక్కింపు ప్రక్రియలో పాల్గొన్నారు. దీనికోసం పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
వేలల్లో మొదలై కోట్లకు చేరిన అమ్మవారి కానుకలు
సమ్మక్క సారలమ్మ మేడారం జాతర సందర్భంగా వచ్చే కానుకలు తొలుత వేలు, ఆ తర్వాత లక్షల్లోకి చేరి క్రమంగా కోట్లకు చేరుకుంది. 2018 సంవత్సరంలో రూ. 8.14 కోట్లు, 2020లో రూ. 9.87 కోట్లు, 2022లో రూ. 12.45 కోట్ల ఆదాయం వచ్చిందని దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. 2024 జాతరలో రూ.13 కోట్ల మేర ఆదాయం వచ్చింది. ఈసారి ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జాతరకు భక్తులు భారీగా పోట్టెత్తినందున ఆదాయం కూడా అదే రీతిలో పెరుగుతుందని ప్రభుత్వ యంత్రాంగం భావిస్తోంది.


